హత్య, దోపిడీ తదితర నేరాలకు శిక్ష వేశారంటే అనుకోవచ్చు. కానీ, నవ్వకపోయినా శిక్ష వేస్తారా? వేస్తారు.. వేస్తారు.. ఎందుకు వెయ్యరు. ఇటలీలో అయితే వేస్తారు. ఔనండి.. నిజం. ఇలాంటి వింత చట్టాలు ఇంకా చాలానే ఉన్నాయి. అవేంటో చూసేయండి.


నవ్వకపోవటం నేరం 


ఇటలీలోని మిలన్‌లో 'హ్యాపీ లా' అనే ఒక చట్టం ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. ఆస్ట్రో హంగేరియన్లు పరిపాలించే సమయంలో మిలనీస్ ప్రజలు స్మైల్ చేస్తూ ఉండాలి అనే రూల్ పెట్టారు. ఆ చట్టం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. విజిటింగ్‌కు వచ్చినవారికి కూడా ఈ రూల్ వర్తిస్తుందా అన్నది క్లారిటీ లేదు. ఎవరైన చనిపోయినపుడు, ఇంట్లో వారికి ఆరోగ్యం బాలేనపుడు, హాస్పిటల్లో ఉన్నపుడు.. ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో మాత్రం ఈ చట్టం వర్తించదు. ఎంత మంచి చట్టమో.. ఇలాంటిది ఇండియాలో కూడా ఉంటే బాగుండనిపిస్తుంది కదా. చట్టమే కావాలా.. రోజూ స్మైల్ చేస్తుండటం ప్రాక్టీస్ చేయండి. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. పైగా ఈ రోజు (5.5.2024) ‘వరల్డ్ లాఫ్టర్ డే’ కూడా.


చూయింగ్ గమ్ నిషేధం  


సింగపూర్ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. అయితే, ఇక్కడ చూయింగ్ గమ్ తినకూడదనే చట్టం ఉంది. ఇక్కడ షాపుల్లో ఎక్కడా చూయింగ్ గమ్ అమ్మరు. అలా అని వేరే దేశం నుంచి వేళ్లేటపుడూ ఒక ప్యాక్ పట్టుకుపోవచ్చు అనుకుంటున్నారేమో.. అదీ కుదరదు. ఈ రూల్ పెట్టిందే శుభ్రత కోసం. చూయింగ్ గమ్‌లు తిని రోడ్ మీద ఎక్కడపడ్తే అక్కడ ఊసేయకూడదని ఏకంగా చూయింగ్ గమ్ లనే బ్యాన్ చేసేసింది ఈ దేశం. మంచి పని చేసింది కదా! 


చెట్లెక్కితే ఫైన్ 


కెనడాలోని ఒషావా అనే సిటీలో చెట్ల రక్షణ కోసం పకడ్బందీగా చట్టాలు ఉన్నాయి. నగరంలో మున్సిపాలిటీ పరిధిలోని చెట్లను ఎక్కటంగానీ, ఏవైనా వస్తువులను చెట్లకు తగించటం కానీ మరే రకంగా కానీ చెట్లకు హాని కలిగించటం నేరమని 2008లో చట్టం తీసుకొచ్చారు. ఇక చెట్లు కొట్టేయటం వంటివి అక్కడ ఎంత పెద్ద నేరమో చెప్పే పని లేదు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కెనెడియన్ చట్టం ప్రకారం ఫైన్ కట్టవలసి ఉంటుంది. ఈ పరిధిలో ఎవరంటే వారు అనుమతి లేకుండా మొక్కలు నాటడానికి కూడా వీల్లేదు. పర్యావరణ రక్షణ కోసం భలే చట్టం తీసుకొచ్చారు కదూ! 


మీ కారు శుభ్రంగా కడగకపోతే ఫైన్ 


UAE దేశం ఇమేజ్ ను కాపాడుకోవటానికి ఎలాంటి చట్టాలనైనా తీసుకురాగలదు. అలాగే ఈ వింత చట్టం కూడా. ఇక్కడ దుమ్ము పట్టిన కార్ కనపడితే అధికారులు ఫైన్ వేస్తారు. అంతే కాకుండా కార్ విడిపించుకోవటానికి కూడా వేరే ఫైన్ కట్టాలి. ఇదే కాదు. కార్ ను ఎక్కడ పడితే అక్కడ కడగటానికి కుదరదు. నీళ్లను వృథా చేయటం, రోడ్లకు నష్టం కలిగించటం ఇవన్నీ దేశం ఇమేజ్ ను దెబ్బతీస్తాయని వారు ఇలాంటి చట్టాలు అమలు చేస్తున్నారు. 


ఇలాంటి రెస్పాన్సిబుల్ చట్టాలు ఉంటేనే దేశాలు అభివృద్ధి చెందుతాయి. ఏది ఏమైనా ఈ దేశాల్లోని ఈ వింత చట్టాలు 'వాహ్వా' అనిపిస్తున్నాయి కదూ!


Read Also: కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు అమెరికా గజగజ - భారీగా పెరుగుతున్న FLiRT కేసులు, లక్షణాలేమిటీ?