New COVID-19 Variant On The Rise In The US: కరోనా వైరస్ కారణంగా అమెరికా అతలాకుతలం అయ్యింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సీన్ రాక తర్వాత నెమ్మదిగా అమెరికా కుదుట పడింది. మళ్లీ కోలుకుని గాడినపడింది. అయినా, ఇప్పటికీ అమెరికాను కోవిడ్-19 భయం వణికిస్తూనే ఉంది. సరికొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అక్కడి ప్రజలు హాస్పిటల్స్ లో చేరుతూనే ఉన్నారు. తాజాగా అమెరికాను కొత్త వేరియంట్ భయపెడుతోంది. FLiRT అనే పేరుతో పిలిచే ఈ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ వేరియంట్ కూడా గత వైరస్ లా మాదిరిగానే ఒమిక్రాన్ వేరియంట్ నుంచే పుట్టుకొచ్చినట్లు పరిశోధకులు భావిస్తున్నారు.


అమెరికాలో పెరుగుతున్న కొత్త వేరియంట్ కేసులు


గత ఏడాది చివరల్లో జేఎన్-1 కరోనా వేరియంట్‌ బాగా విస్తరించింది. దీనిని తొలిసారి సెప్టెంబర్‌లో గుర్తించారు. జేఎన్.1  కరోనా స్పైక్ ప్రోటీన్‌ లో మ్యుటేషన్ కలిగి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం కొత్త వేరియంట్ FLiRT కూడా దాని మాదిరిగానే వ్యవహరిస్తోందని వెల్లడించారు. ఇది జేఎన్.1 నుంచి ఏర్పడిన ఓమిక్రాన్‌ లక్షణాలను కలిగి ఉన్నట్లు తెలిపారు. గత రెండు వారాల్లో అమెరికాలో నమోదైన కోవిడ్ -19 కేసుల్లో 25 శాతం FLiRT వేరియంట్ కేసులే ఉన్నాయన్నారు. అయితే, దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఈ వేరియంట్ విస్తరించలేదని తెలిపారు.


FLiRT ప్రమాదకరమా?


FLiRT వేరియంట్ రోగిపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుంది? అనే విషయంపై పరిశోధన సాగుతోంది. అయితే, ఇది రోగ నిరోధక శక్తిని విపరీతంగా తగ్గిస్తున్నట్లు గుర్తించారు. గత వేరియంట్ల మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి సోకుతుందన్నారు. ఈ వేరియంట్ సోకిన వారిలో జ్వరం, జలుబు, గొంతు నొప్పి, దగ్గు సహా జీర్ణాశయ సమస్యలు ఉన్నట్లు తెలిపారు. 


FLiRT అంటే?


ఫ్లిర్ట్(flirt) అంటే మాటలతో పడగొట్టడం లేదా సరసాలు ఆడటమో కాదు. కొత్తగా ఏర్పడే కోవిడ్-19 వేరియెంట్లలో.. నిర్దేశిత మ్యూటేషన్స్‌ను సులభంగా గుర్తించేందుకు వీలుగా.. వాటి శాస్త్రీయ పదాలతో పేర్లు పెడుతుంటారు. FLiRT కూడా అలాగే పుట్టింది. JN.1 వేరియెంట్ నుంచి ఏర్పడిన ఈ కొత్త మ్యూటేషన్‌లో ఒకదానికి F, L.. మరొకదానికి R, T అక్షరాలు ఉన్నాయి. అవన్నీ కలిపి.. ఈ కొత్త వేరియెంట్‌కు FLiRT అని పేరు పెట్టారు. 


అమెరికాలో మరో కోవిడ్-19 వేవ్ తప్పదా?


అమెరికాలో కోవిడ్ -19 కొత్త వేరియంట్ కేసులు భారీగా నమోదు అవుతున్నప్పటి, ఎక్కువ ప్రమాదం ఉండబోదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జేఎన్-1 వేరియంట్ సోకిన వ్యక్తులు ఇన్ఫెక్షన్ నుంచి కొంత కోలుకున్నట్లు తెలిపారు. గతంతో మాదిరిగా రోగులపై కొత్త వేరియంట్లు బలమైన ప్రభావాన్ని చూపించడం లేదంటున్నారు. అంతేకాదు, కొత్త వేరియంట్లు వస్తున్నప్పటికీ బలహీనం అవుతున్నట్లు చెప్పారు.


జాగ్రత్తలు పాటించాలంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ


కోవిడ్-19 విషయంలో భయపడాల్సిన అవసరం లేకపోయినా, జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కోవిడ్-19 వైరస్ రూపాంతరం చెందుతూనే ఉంటుందని అభిప్రాయపడింది. వీలైనంత వరకు ప్రజలు టీకాలు వేసుకోవాలని సూచించింది. ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం మంచిదని తెలిపింది. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా మాస్క్ ధరించాలని సూచించింది. మనిషికి మనిషికి మధ్యన దూరం పాటించాలని చెప్పింది. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెల్లకూడదని చెప్పింది. కరోనా విషయంలో అలసత్వం వహించకూడదని వివరించింది. పిల్లల విషయంలోనూ తల్లిదండ్రులు తప్పకుండా కరోనా సూచనలు పాటించాలని చెప్పింది.


Read Also: చీటికి మాటికి కోపంతో ఊగిపోతున్నారా? ప్రాణాలు పోవడం ఖాయం - ఎందుకంటే?