Side Effects Of Covishield Vaccine: ఎట్టకేలకు ఆస్ట్రాజెనెకా.. తన నుంచి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్​ వల్ల అరుదైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని అంగీకరించింది. కోవిడ్ -19 సమయంలో ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్​ బ్రాండ్​ పేరుతో వ్యాక్సిన్లను విక్రయించింది. అయితే ఈ వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో కొన్ని అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే దుష్ప్రభావాలకు కారణమవుతుందని ఆస్ట్రాజెనెకా ఒప్పుకుంది. సెరమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ద్వారా దీనిని కరోనా సమయంలో ఇండియాలో విస్తృతంగా పంపిణీ చేశారు. 


ప్రాణాలను హరిస్తున్న సైడ్ ఎఫెక్ట్స్


కరోనాను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో వ్యాక్సిన్లను తీసుకొచ్చారు కానీ.. వాటి గురించి సరైన జాగ్రత్తలు తీసుకోలేదు.. సైడ్ ఎఫెక్ట్​ల గురించి పట్టించుకోలేదనేది ఎట్టకేలకు స్పష్టమైంది. కరోనా తగ్గడం ఏమో కానీ కొత్త ఆరోగ్య సమస్యలు ప్రజలను ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువైంది. బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ అరుదైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని తాజాగా కోర్టులో అంగీకరించింది. దీనికి సంబంధించిన రిపోర్ట్​ను ది టెలిగ్రాఫ్(యూకే)కు నివేదించింది.


యూకేలో 2021లోనే ఈ కేసు వేశారు..


ఆస్ట్రాజెనెకాపై యూకేలో క్లాస్ యాక్షన్ దావా వేశారు. ఈ టీకా తీసుకున్నవారిలో కొందరు మరణించారని, తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో కోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా సైడ్ ఎఫెక్ట్స్​ గురించి బయటపెట్టింది. యూకేకు చెందిన జామీ స్కాట్.. 2021 ఏప్రిల్​లో ఈ కేసును వేశారు. తను వ్యాక్సిన్ తీసుకున్నాక.. రక్తం గడ్డకట్టిందని.. మెదడుపై అది తీవ్రమైన ప్రభావం చూపించిందని దానిలో వివరించాడు. దీనివల్ల అతను పనికి దూరమయ్యానని దానిలో పేర్కొన్నాడు. మూడుసార్లు చనిపోదామని డిసైడ్ అవ్వగా.. తన భార్య అందుకు అడ్డుకుందంటూ కేసు వేశాడు. ఈ నేపథ్యంలోనే మరికొందరు కోవిషీల్డ్ వ్యాక్సిన్​పై కేసు వేశారు. 


కరోనా ప్రధాన వ్యాక్సిన్లలో ఇది కూడా ఒకటి..


కోవిషీల్డ్ కొందరిలో రక్తం గడ్డకట్టడానికి, ప్లేట్​లెట్​ కౌంట్​ను తగ్గించేస్తుందని ఆస్ట్రాజెనెకా తెలిపింది. కానీ ఇవి రేర్ కేస్​లలో జరుగుతాయని వెల్లడించింది. దీనికి సంబంధించిన పత్రాలను వ్యాక్సిన్ తయారీదారు ఆస్ట్రాజెనెకా కోర్టులో డాక్యూమెంట్స్ సబ్​మీట్ చేసింది. కరోనా సమయంలో ఆస్ట్రాజెనెకా, ఆక్స్​ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, సెరమ్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లను ఎక్కువ మోతాదులో ఇండియాలో ఇచ్చారు. ఇప్పటికే వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని పలువురు ఆరోపించినా.. పెద్దగా దీనిని ఎవరూ తీసుకోలేదు కానీ.. తయారీదారులే ఈ సైడ్ ఎఫెక్ట్స్​ గురించి చెప్పేసరికి అందరిలోనూ ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. 



ముందు నో అన్నారు.. తర్వాత దిగొచ్చారు..


మొదట్లో ఆస్ట్రాజెనెకా దీనిని వ్యతిరేకించినా.. ఫిబ్రవరిలో కోర్టు డాక్యుమెంట్​లలో ఒకదానిలో కోవిషీల్డ్.. అరుదైన సందర్భాల్లో TTSకి కారణమవుతుందని అంగీకరిస్తూ నివేదిక అందించింది. TTS అనేది థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్. ఇది రక్తం గడ్డకట్టేలా చేయడం, బ్లెడ్​లోని ప్లేట్​లెట్ కౌంట్​ను తగ్గించే లక్షణాలు కలిగి ఉందని చావు కబురు చల్లగా చెప్పారు. అయితే ఆస్ట్రాజెనెకా TTSకి కారణమవుతుందని ఒప్పుకుంది కానీ.. వ్యాక్సిన్ తీసుకోనివారికి కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదముంది కాబట్టి.. మరోసారి దీనిపై విచారణ జరపాల్సి ఉందని ఆస్ట్రాజెనెకా కోరింది.


Also Read : టీబీ వ్యాధిని కంట్రోల్ చేసే ఇమ్యునోథెరపీలు.. చికిత్సలో ఇవే గేమ్ ఛేంజర్