Pension Department: మీరు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా వారి కోసమ ఈ వార్త. అవును కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెన్షనర్లకు పెద్ద శుభవార్త చెప్పింది. ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పింఛన్ పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో 'ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్' రూపొందించింది. ఈ కొత్త ఆన్‌లైన్ పోర్టల్ గురించి పూర్తి వివరాలు వెంటనే తెలుసుకోండి.
పెన్షన్ ప్రాసెసింగ్‌ను ఒక్కచోటికి
'ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్' 5 రకాల బ్యాంకుల చెల్లింపు సేవలతో పాటు పెన్షన్ ప్రాసెసింగ్‌ను ఒక్కచోటికి తీసుకువస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటు పింఛనుదారుల జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించినట్లు పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించింది. వాస్తవానికి వయసు మీద పడి బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగటం కష్టంగా ఉండే చాలా మంది వృద్ధ పెన్షనర్లకు ఇది నిజంగా పెద్ద ఊరటను అందించే సేవని అనేక మంది సానుకూలత వ్యక్తం చేస్తున్నారు.
SMS లేదా ఈ-మెయిల్ ద్వారా సమాచారం
ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకతను తీసుకురావటంతో పాటు సేవల్లో సామర్థ్యాన్ని పెంచటంగా ఉంది. ఇందులో పెన్షనర్లకు సంబంధించిన వ్యక్తిగత, సర్వీస్ వివరాలు పొందుపరిచి ఉంటాయి. అలాగే పెన్షనర్లకు వారి పెన్షన్ ఆమోదం గురించి SMS లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలా దోహదపడుతుంది. ఇది పెన్షనర్‌కు తన పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి, వాటిని డిజిలాకర్‌లో సేవ్ చేయటానికి, ఎలక్ట్రానిక్‌గా PPOని జారీ చేయడానికి సౌకర్యాన్ని కల్పిస్తోంది.
కొత్త పెన్షనర్ పోర్టల్ ప్రారంభంతో 5 బ్యాంకులకు చెందిన పెన్షనర్లు తమ ఫించను సంబంధిత వివరాలను లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితి, ఫారం-16, చెల్లించిన- స్వీకరించిన మొత్తం వివరాలు, పెన్షన్ స్లిప్ వంటి వివరాలను పొందగలరు. పోర్టల్‌ను బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సంబంధిత సేవలతో అనుసంధానం చేయడం పూర్తయింది. పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపులు ఎండ్-టు-ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలా పోర్టల్ రూపొందించబడింది. గతంలో ఈ సదుపాయం కేవలం ఎస్బీఐ పెన్షనర్లకు మాత్రమే ఉండేదని మనందరికీ తెలిసిందే.