వాతావరణం మారగానే చాలా మంది ఎదుర్కొనే సమస్య గొంతు నొప్పి. కొన్ని సార్లు ఇది సాధారణంగా ఉన్నప్పటికీ మరికొన్ని సార్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గొంతు నొప్పి వల్ల ఆహారం తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆహారం నమిలి మింగలేక ఆకలితో ఉండిపోవాల్సి వస్తుంది. చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. కొన్ని ఆహారాలతో తీసుకుంటే ఈ గొంతు నొప్పి సమస్య నుంచి బయటపడొచ్చు. వంటగదిలో సులభంగా దొరికే వాటితో మీ గొంతు నొప్పిని మటుమాయం చేసుకోవచ్చు.


టీ: జలుబు అనిపించినప్పుడు అందరూ మొదటగా ఎంచుకునేది అల్లం టీ. ఇది చాలా చక్కని రెమిడీగా పని చేస్తుంది. వేడి వేడి టీ తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి తగ్గించుకోవడం మాత్రమే కాదు.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అల్లం, దాల్చిన చెక్క, పుదీనా, చామంతి పూల టీ, సేజ్, లిక్కోరైస్, రోజ్మెరి కూడా వేసుకుని టీ తయారు చేసుకుని తాగొచ్చు.


వెల్లుల్లి: వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలని కలిగి ఉంటుంది. గొంతు నొప్పికి కారణమయ్యే బ్యాక్టీరియాని చంపుతుంది. జలుబు నుంచి బయటపడేందుకు సహాయపడుతుంది. వెల్లుల్లి తొక్క తీసి రసం చేసుకుని తాగొచ్చు లేదంటే పచ్చిగా అయినా తినొచ్చు.


స్మూతీస్: గొంతు నొప్పి కారణమగా ఆహరం తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీని వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందవు. అందుకే ఇటువంటి సమయంలో స్మూతీస్ చక్కని ఎంపిక. రకరకాల పండ్లు, కూరగాయలతో చేసే స్మూతీస్ వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు పొందుతారు. 


లైకోరైస్: లైకోరైస్ గొంతు నొప్పికి అద్భుతమైన నివారణిగా పని చేస్తుంది. చాలా మంది సింగర్స్ తమ గొంతు నొప్పి పోగొట్టుకునేందుకు దీన్నే ఉపయోగిస్తారు. లైకోరైస్ రూట్ చిన్న ముక్కని తీసుకుని దంతాల మధ్య ఉంచుకోవాలి. దాన్ని కొద్ది కొద్దిగా కోరుకుతూ రసం తాగాలి. లైకోరైస్ రసాన్ని పీల్చినప్పుడు అది గొంతుని సవరిస్తుంది. అంతే కాదు దగ్గుని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.


ఓట్ మీల్: ఓట్ మీల్ లో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఓట్స్ తో ఇతర ఆహార పదార్థాలు కలుపుకుని తినడం వల్ల అదనంగా పోషకాలు పొందుతారు. విటమిన్ సి పొందటం కోసం అందులో కొంచెం అరటి పండు జోడించుకోవచ్చు. ఓట్ మీల్ లో కొంచెం తేనె, దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే సూపర్ హెల్తీ.


స్పైసెస్: పసుపు, అల్లం, దాల్చిన చెక్క గొంతు నొప్పికి సహజ నివారణలు. ఇవి కనుక తరచుగా తీసుకుంటే గొంతు నొప్పి, జలుబుని తగ్గిస్తుంది. ఈ మసాలా దినుసులు ఓట్ మీల్, టీ, స్మూతీస్ లేదా సాధారణ ఆహారంలో కూడ చేర్చుకోవచ్చు.


తేనె: తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలని కలిగి ఉంటుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఏ పదార్థంతో తీసుకున్న కూడా మంచిదే. టీ లేదా స్మూతీస్ మరింత అదనపు రుచి ఇస్తుంది. ఒక స్పూన్ తేనె కూడా తినొచ్చు. గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: చలికాలంలో ఈ పానీయాలు తీసుకుంటే అందం, ఆరోగ్యం మీ సొంతం