ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ రోజులో సగం సమయం ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్, డెస్క్ టాప్స్ కి అంకితం అవుతున్నారు. ఉదయం లేచిన వెంటనే ఫోన్ ముఖమే చూస్తున్నారు. ఇక ఆఫీసుకి వెళ్తే గంటల తరబడి డెస్క్ టాప్స్ చూస్తూ ఉంటారు. దీని వల్ల కళ్ళు దెబ్బతిని చూపు మందగించడం వంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. కొంతమంది కళ్ల జోడు పెట్టుకుని కాలం గడిపేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం కళ్లజోడు పెట్టుకుంటే అందంగా అనిపించమేమో అని కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని కవర్ చేసుకుంటున్నారు. ఇటువంటి సమస్యలు ఎదుర్కొకుండా ఉండాలంటే కళ్ళని సంరక్షించే ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం. వాటిని తినడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మీకు చాలా మంచిది.
కోడి గుడ్లు
కళ్ళు ఆరోగ్యంగా ఉండి చూపు సక్రమంగా ఉండేందుకు కోడిగుడ్లు చాలా మంచిది. కళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు, విటమిన్ ఎ, లుటిన్ అనే పదార్థం గుడ్లలో మెండుగా లభిస్తుంది. అందుకే వీటిని పచ్చిగా లేదా ఉడకబెట్టుకుని తిన్నా ఆరోగ్యానికి మంచిదే.
బుద్ధాస్ హ్యాండ్ ఫ్రూట్
చూసేందుకు కొంచెం విచిత్రంగా ఉండే ఈ పండు కళ్ల సంరక్షణకి చాలా మంచిది. సిట్రస్ ఫుడ్ ఇది. విటమిన్ సి మెండుగా ఉంటుంది. కంటిలోని రెటీనా పొర దెబ్బతినకుండా ఇది సంరక్షిస్తుంది. తరచూ దీన్ని తినడం వల్ల మీ కంటి చూపు బాగుంటుంది.
క్యారెట్
హిమోగ్లోబిన్ పెరిగేందుకే కాదు కంటి చూపు బాగుండెలా చేసేందుకు కూడా క్యారెట్ చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ ఎ, బీటా కెరొటిన్ కంటి ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. కోడిగుడ్లు మాదిరిగానే ఇది కూడా కంటి చూపు సక్రమంగా ఉండేలా చేసేందుకు సహాయపడుతుంది.
బాదం పప్పు, జీడిపప్పు
కంటి సమస్యలనను ఎదుర్కోవడానికి విటమిన్ ఇ, ఒమేగా యాసిడ్స్ చాలా వాసరం. ఇవి బాదం పప్పు వంటి డ్రై ఫ్రూట్స్ లో పుష్కలంగా లభిస్తాయి. జంక్ ఫుడ్ స్నాక్స్ గా తీసుకునే బదులు ఈ నట్స్ తింటే ఆరోగ్యంగా మీ కంటిని సంరక్షించుకున్నట్టే. ఆరోగ్యం కదా అని తెగ తినెయ్యకండి. ఎందుకంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటే శరీరానికి అధిక మొత్తంలో కేలరీలు అందుతాయి. అందుకే మోతాదుకు మించి తీసుకోకండి.
చేపలు నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్, మటన్ కి బదులుగా చేపలు వంటి సీ ఫుడ్ తీసుకోవడం కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి చూపు బాగుండేలా చెయ్యడంలో సహాయపడతాయి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఒమేగా ఆమ్లాలు పొందే విధంగా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.
Also Read: ‘హర్ ఘర్ తిరంగా’లో మీ పేరును ఇలా నమోదు చేస్కోండి, ఈ సర్టిఫికెట్ పొందండి
Also read: ఈ దేశాలకు వీసా దొరకడం చాలా కష్టమట, ఆ దేశాలేంటో తెలిస్తే షాక్ తింటారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.