కామన్వెల్త్ క్రీడల్లో నిమిషాల వ్యవధిలోనే భారత్‌కు 4 పతకాలు వచ్చాయి. టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో శరత్‌ కమల్‌ స్వర్ణం గెలిచాడు. మరో ఆటగాడు సాతియన్‌ జ్ఞానశేఖరన్‌ కాంస్యం కైవసం చేసుకుంది. ఇక బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి జోడీ పసిడి పతకం పట్టేసింది. పురుషుల హాకీలో టీమ్‌ఇండియా రజతానికే పరిమితమైంది.






సాత్విక్‌, చిరాగ్‌ రికార్డు


బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ తరఫున తొలి పతకం గెలిచిన పురుషుల జోడీగా అవతరించారు. ఇంగ్లాండ్‌ ద్వయం బెన్‌ లేన్‌, సేన్‌ వెండీని 21-15, 21-13 తేడాతో చిత్తు చేశారు. తొలి గేమ్‌లో రెండు జోడీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డాయి. 1-1, 5-5, 8-8, 10-10తో సమంగా ఆడారు. ఆ తర్వాత భారత్‌ జోడీ విజృంభించింది. వరుస పాయింట్లతో చెలరేగి 18-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 21-15 గేమ్‌ గెలిచేసింది. రెండో గేమ్‌లోనూ 7-7, 9-9 రెండు జోడీలు శ్రమించాయి. విరామం తర్వాత భారత ఆటగాళ్లూ దూకుడు పెంచారు. 21-13 తేడాతో గేమ్‌తో పాటు మ్యాచును గెలిచేశారు.






శరత్‌ కమల్‌ ఎన్నాళ్లకో


టేబుల్‌ టెన్నిస్‌లో రెండు పతకాలు వచ్చాయి. సీనియర్‌ ప్యాడ్లర్‌ ఆచంట శరత్‌ కమల్‌ స్వర్ణం ముద్దాడాడు. ఇంగ్లాండ్‌ ఆటగాడు లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌ను 4-1 తేడాతో ఓడించాడు. 11-13, 11-7, 11-2, 11-6, 11-8తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. 2006 మెల్‌బోర్న్‌ కామన్వెల్త్‌ తర్వాత అతడు ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. అంతకు ముందు పురుషుల సింగిల్స్‌లో సాతియన్‌ కాంస్యం కొల్లగొట్టాడు. ఇంగ్లాండ్‌ ప్యాడ్లర్‌ పాల్‌ డ్రింఖాల్‌ను 11-9, 11-3, 11-5, 8-11, 10-12, 11-9 తేడాతో ఓడించాడు.






రజతమే ముద్దు!


భారత పురుషుల హాకీ జట్టు రజతం సొంతం చేసుకుంది. పటిష్ఠమైన ఆస్ట్రేలియా చేతిలో 0-7తో పరాభవం చవిచూసింది. గేమ్‌ ఆరంభం నుంచి కంగారూలు టీమ్‌ఇండియాకు వణుకు పుట్టించారు. పదేపదే డిఫెన్స్‌ను ఛేదిస్తూ గోల్స్‌ వర్షం కురిపించారు. తొలి తొలి  క్వార్టర్లో 2, రెండో క్వార్టర్లో 3, మూడు, నాలుగో క్వార్టర్లో ఒక్కో గోల్‌ చొప్పున నమోదు చేశారు. కామన్‌వెల్త్‌లో టీమ్‌ఇండియా రజతానికే పరిమితం అవ్వడం ఇది మూడోసారి.