క్యాన్సర్... శరీరాన్ని కుళ్లిపోయేలా చేసే వ్యాధి. ఏ అవయవానికి వస్తే ఆ అవయవాన్ని పుండులా మార్చేస్తుంది. శరీరంలో ఏ అవయవానికైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ భాగానికి రాదు అని చెప్పడానికి వీల్లేదు. అయిదే ఒక కొత్త అధ్యయనం ప్రకారం కొన్ని రకాల క్యాన్సర్లు ఆడవారి కన్నా మగవారిలోనే వచ్చే అవకాశం ఎక్కువ. క్యాన్సర్ అంటే శరీరంలోని ఒక నిర్ధిష్ట భాగంలో కణాలు అనియంత్రితంగా పెరిగిపోతాయి. అవి పుండులా తయారవుతాయి. ఈ క్యాన్సర్ కణాలు అవయవాలతో సహా కణజాలాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్ వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభించిందంటే చికిత్స చేయడం కష్టమైపోతుంది. అందుకే వ్యాప్తి చెందకముందే ఎక్కడ వచ్చిందో ఆ అవయవానికి చికిత్స చేయడం ప్రారంభించాలి.
క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని చెప్పడానికి స్పష్టంగా కారణం తెలియదు. ప్రతి ఇద్దరిలో ఒకరికి వారి జీవితకాలంలో క్యాన్సర్ అవకాశాలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. క్యాన్సర్ కారకాలు చాలా ఉన్నాయి. వాటిలో లింగం కూడా ప్రమాదకారకంగా మారుతుందని చెబుతోంది కొత్త అధ్యయనం. అంటే ఆడవారికన్నా మగవారిలో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అధికంగా ఉంటుందని కనిపెట్టింది.
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 1995 నుంచి 2011 మధ్య క్యాన్సర్ బారిన పడిన 2,94,100 మంది రోగుల డేటాను విశ్లేషించారు. ఆ డేటాను బట్టి పురుషులే ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు గుర్తించారు. అయితే పురుషులకే ఎందుకు ఎక్కువ క్యాన్సర్ సోకుతుందో మాత్రం చెప్పలేకపోయారు శాస్త్రవేత్తలు. అయితే వారికే ఎందుకు ఎక్కువ వస్తుందో తెలుసుకుంటే చికిత్సలో మరింత అభివృద్ధి సాధించవచ్చని భావిస్తున్నారు అధ్యయనకర్తలు.
ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశం
అధ్యయనం ప్రకారం క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదం మహిళల కంటే పురుషుల్లో 1.3 నుంచి 10.8 రెట్లు ఎక్కువ. పురుషుల్లో స్వర పేటిక క్యాన్సర్ వచ్చే అవకాశం 3.5 రెట్లు, గ్యాస్టిక్ కార్డియా క్యాన్సర్ వచ్చే అవకాశం 3.5 రెట్లు, మూత్రాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం 3.3 రెట్లు, ఆహారవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం 10.8 రెట్లు అధికం. అయితే థైరాయిడ్, పిత్తాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం మాత్రం మగవారిలో కన్నా ఆడవారిలోనే ఎక్కువ. పదహారేళ్ల కాలాన్ని పరిశీలిస్తే పురుషుల్లో 17,951 క్యాన్సర్లు వస్తే, మహిళల్లో 8,742 క్యాన్సర్లు అభివృద్ధి చెందాయి.
ధూమపానం, చెడు ఆహారం, మద్యపానం, మధుమేహం వంటివి క్యాన్సర్లు రావడానికి దోహదపడుతున్నాయి. అందుకే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్లు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
Also read: ఇతరుల కన్నా దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? దానికి మీ రంగు కూడా కారణం కావచ్చు
Also read: మీరు చాలా బిజీయా? అయితే పది నిమిషాల్లో తయారయ్యే దోశెల రెసిపీలు ఇవిగో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.