అధికంగా కొవ్వు పేరుకుపోవడం ఆరోగ్యానికి అన్నీ విధాలుగా చేటు చేస్తుంది. శరీరంలో రెండవ అతిపెద్ద అవయవం కాలేయం. దీనికి కొవ్వు పేరుకుపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్య వస్తుంది. దాన్నే ఫ్యాటీ లివర్ డీసీజ్ అని కూడా అంటారు. కాలేయం జీవక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒక్కోసారి కొవ్వు విపరితంగా పేరుకుపోవడం వల్ల కాలేయం పనితీరు మందగిస్తుంది. ఫ్యాటీ లివర్ రెండు రకాలు. ఒకటి ఆల్కహాలిక్, రెండోది నాన్ ఆల్కహాలిక్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ను వైద్య పరిభాషలో స్టీటోసిస్ అని కూడా అంటారు. మద్యపానం చెయ్యని వ్యక్తుల్లో ఇది సంభవిస్తుంది. ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటూ దీని నుంచి బయటపడొచ్చు.
అసలు కాలేయంలో కొవ్వు ఎందుకు చేరుతుంది?
కాలేయంలో కొవ్వు మొత్తం మన లివర్ బరువులో 5% మించి ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు కొవ్వు పేరుకుపోతుంది. చక్కెర పానీయాలు, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కేలరీలు ఎక్కువ తీసుకుంటున్నట్టు అవుతుంది. దీని వల్ల అవసరానికి మించి కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. అందుకే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు.
ఎవరికి ప్రమాదం?
స్టీటోసిస్ బరువుకి సంబంధించినది. 30 కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్(BMI) ఉన్న వాళ్ళు దీని వల్ల ప్రమాదంలో పడతారు. BMI బరువు, ఎత్తుతో సంబంధం కలిగి ఉంటుంది. శరీరం బరువు పెరిగే కొద్ది కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టే. మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్ తో బాధపడే వాళ్ళలో కూడా ఈ ఫ్యాటీ లివర్ సమస్య మరింత హాని చేస్తుంది. ఈ సమస్య ఎక్కువ అయితే మరింత ప్రమాదకరంగా మారుతుంది. కొంతమంది రోగుల్లో కాలేయంలోని కొవ్వు స్టీటోహెపటైటిస్ దారితీస్తుంది. దీని వల్ల కాలేయంలో మచ్చలు ఏర్పడతాయి. వ్యాధి ముదిరింది అనేదానికి ఇది సంకేతం. దీన్నే సిర్రోసిస్ అంటారు. మచ్చ కణజాలం ఏర్పడిన తర్వాత దానిని తొలగించడం లేదా చికిత్స చేయడం సాధ్యం కాదు. అందుకే వ్యాధి ముదరక ముందే గ్రహించి వెంటనే చికిత్స తీసుకోవాలి. అప్పుడే ప్రమాదం నుంచి బయటపడతారు.
కొవ్వు ఎలా తగ్గించుకోవాలి?
కాలేయంలో కొవ్వు తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గం బరువు తగ్గడం. ఆహారంలో మార్పులు చేసుకుంటూ డైట్ ఫాలో అవుతూ శరీరానికి తగినంత శారీరక శ్రమ ఇవ్వడం వల్ల దీని నుంచి బయట పడొచ్చు. మీ BMI 35 కంటే ఎక్కువ ఉంటే మాత్రం శస్త్రచికిత్స ద్వారా మాత్రమే కొవ్వుని తీసేయగలరు. మధుమేహం ఉంటే ఇది మరింత ప్రమాదకరం. ఆల్కాహాల్ అలవాటు ఉంటే వెంటనే నివారించడం మంచిది. బరువు తగ్గడం వల్ల కొవ్వు కరిగి ఎటువంటి సమస్యలు లేకుండా ఎక్కువ కాలం జీవించవచ్చు.
ఫ్యాటీ లివర్ గుర్తించే లక్షణాలు
ఫ్యాటీ లివర్ తో బాధపడే వాళ్ళలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. కానీ వ్యాధి ముదరకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం అసలు నిర్లక్ష్యం చెయ్యకూడదు.
❂ కాలేయం మీద కుడి ఎగువ భాగంలో నొప్పి
❂ ఆకలి లేకపోవడం
❂ వికారం
❂ కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం(వ్యాధి మరింత ముదిరినప్పుడు ఇది కనిపిస్తుంది)
❂ బొడ్డు వాపు రావడం జరుగుతుంది.(ఇది కూడా వ్యాధి మురినప్పుడే కనిపిస్తుంది)
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: డయాబెటిస్ ఉందా? ఈ పండు తింటే మీకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
Also Read: మీ మూడ్ మార్చే సూపర్ ఫుడ్స్ - ఇవి తింటే రిఫ్రెష్ అయిపోతారు