Tamilnad Mercantile Bank IPO: ఇవాళ (గురువారం) స్టాక్‌ మార్కెట్‌లోకి అరంగేట్రం (లిస్టింగ్‌) చేసిన తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ (TMB), ఐపీవో సబ్‌స్క్రైబర్లను నిరాశ పరిచాయి. లిస్టింగ్‌ గెయిన్స్‌ తీసుకోవచ్చనుకుంటే, లాసెస్‌లో ముంచాయి.


ఈ షేర్‌ ఇష్యూ ప్రైస్‌ రూ.510 అయితే, దాదాపు అదే ధర దగ్గర బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లో (BSE) లిస్ట్ అయింది. అక్కడి నుంచి రూ. 515 వరకు దూసుకెళ్లింది. ఇది ఇంట్రా డే గరిష్ట స్థాయి. గోడకు కొట్టిన బంతిలా, మళ్లీ అక్కడి నుంచి రూ.481 వరకు ఒక్కసారిగా వెనక్కు వచ్చింది. తిరిగి పుంజుకుని రూ.510 స్థాయి చుట్టూ చక్కర్లు కొడుతోంది.


నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (NSE), ఇష్యూ ధర కంటే దాదాపు 6 శాతం తక్కువగా, ఒక్కో షేరు రూ.495 వద్ద ప్రారంభమైంది.


మధ్యాహ్నం 2:30 గంటలకు, TMB షేరు ధర రూ.508.50 వద్ద ఉంది. ఇది, BSEలో ఇష్యూ ప్రైస్‌ కంటే స్వల్పంగా తక్కువ. ఈ కౌంటర్‌లో ఇప్పటివరకు 20 లక్షల 50 వేలకు పైగా ఈక్విటీ షేర్లు చేతులు మారాయి.


ఈ బ్యాంక్‌ న్యాయపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మేనేజ్‌మెంట్ దీర్ఘకాలిక పనితీరు మీద పెట్టుబడిదారులకు పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. ఐపీవో సబ్‌స్క్రిప్షన్ నంబర్లు బెటర్‌గా లేకపోవడం, ఇవాళ్టి వీక్‌ మార్కెట్‌ స్టాక్‌ నెగెటివ్‌ లిస్టింగ్‌కు కొన్ని కారణాలుగా రీసెర్చ్‌ హౌస్‌ స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ (Swastika Investmart Ltd) వెల్లడించింది.


లిస్టింగ్ లాభాల కోసం ఐపీవోలో దరఖాస్తు చేసుకున్న వాళ్లు రూ.470ని స్టాప్‌ లాస్‌గా పెట్టుకోవాలని ఆ రీసెర్చ్‌ హౌస్‌ సూచించింది. దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడి పెట్టిన వాళ్లు, ఇబ్బందులు తొలగిపోయేవరకు మరికొన్ని త్రైమాసికాల పాటు వేచి ఉండాలని చెబుతోంది.


మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు, బుధవారం రోజున BSE ఒక బాంబ్‌ పేల్చింది. తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్ ఈక్విటీ షేర్లను 'T' గ్రూప్ సెక్యూరిటీస్‌ జాబితాలో చేరుస్తామని పేర్కొంది. మళ్లీ సమాచారం ఇచ్చే వరకు ఈ స్క్రిప్ ట్రేడ్ ఫర్ ట్రేడ్ (T2T) విభాగంలో ఉంటుంది. T2T గ్రూప్‌లో ఉన్న స్టాక్స్‌ను ఇంట్రా డే ట్రేడింగ్‌కు అనుమతించరు. వీటిని డెలివరీ బేస్‌లోనే తీసుకోవాలి. అంటే, కొనుగోలుదారు ఈ షేర్లను డెలివరీ మోడ్‌లోనే తీసుకోగలరు తప్ప, ఇంట్రా డే ట్రేడ్‌ చేయలేరు.


TMB IPO దాదాపు మూడు రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను దక్కించుకుంది. ఈ ఇష్యూ కోసం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు (QIB) 1.62 రెట్లు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్‌ (HNI) 2.94 రెట్లు, రిటైల్ లేదా చిన్న ఇన్వెస్టర్లు (మనలాంటి వాళ్లు) దాపు 6.5 రెట్లు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. ఈ బ్యాంక్, IPO ముందు రోజు రూ.363 కోట్ల విలువైన షేర్లను రూ.510 చొప్పున యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.