వేసవి వేడి తరచూ జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. పొట్టలో అసౌకర్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని రకాల ఆహారాలు ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల సరిగా అరగక వికారం, మంట వంటివి కలిగిస్తుంది. ఇలాంటి దుష్ప్రభావాలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆకుకూరలు, మసాలా దినుసులను తినాలి. వీటిని తినడం పొట్టలోని మంట, ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 


పుదీనా
పుదీనాను మనం ఆకుకూరగా వాడుకుంటాం కానీ ఆయుర్వేదంలో అది మూలికతో సమానం. దీనిలో మెదడును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచే మెంథాల్ ఉంది. వండే కూరల్లోనే కాదు, షేక్‌లు, జ్యూసులు, నిమ్మరసం, సలాడ్లలో వేసుకుని తింటే చాలా మంది. వేడిని తగ్గించే శక్తి దీనికుంది. 


లేత తులసి ఆకు
తులసి మొక్క తెలుగిళ్లలో ఉండడం సహజం. వేసవికాలంలో శరీరాన్ని చల్లబరిచే గుణం దీనికీ ఉంది. పిజ్జా, పాస్తా, షేక్స్, స్మూతీస్... ఇలా అన్నింట్లోను దీన్ని భాగం చేసుకోవచ్చు. తులసాకు రసాన్ని తాగిన మంచిదే. 


సోంపు 
భోజనం చేశాక చాలా మంది గుప్పెకు సోంపు నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు. దీనికి శీతలీకరణ లక్షణాలు ఎక్కువ.అందుకే పేగులలోని రసాలను ప్రేరేపిండి జీర్ణ క్రియ సక్రమంగా సాగేలా చేస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గిస్తుంది. దీన్నీ రోజూ భోజనం చేశాక తింటే చాలా మంచిది. రోజులో కనీసం రెండు మూడు సార్లు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 


కొత్తిమీర
కూర ఏదైనా దానిలో గుప్పెడు కొత్తిమీర తరుగు పడితే ఆ రుచే వేరు. వీలైతే రోజు కొత్తి మీర తినేందుకు ప్రయత్నించాలి. వేసవిలో ఇది చాలా మేలు చేస్తుంది. అధిక వేడి వల్ల కలిగే సమస్యను తగ్గించి జీర్ణ వ్యవస్థలో ఉపశమనం కలిగేలా చేస్తుంది. మంట తగ్గేలా, శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపేలా చేస్తుంది. ధనియాలు, కొత్తిమీర రెండూ తిన్నా మంచిదే. 


యాలకులు
ఖరీదైన సుగంధ ద్రవ్యం యాలకులు. పావుకిలో కొనాలంటే వందల్లో ఖర్చుపెట్టాల్సిందే. రెండు యాలకులు వేసినా చాలు పాయసం అదిరిపోతుంది. అంత శక్తివంతమైనవి ఇవి. ఇవి వేసవిలో శరీరంలో చేరే అవాంఛిత రసాయనాలను, టాక్సిన్లను బయటికి పంపేస్తుంది. జీర్ణ క్రిమ బాగా జరిగేలా చూస్తుంది. వికారం, గుండెల్లో మంటతో పోరాడుతుంది. అందుకే రోజుకు రెండు యాలకులు తింటే చాలా మంచిది. 


Also read: మనుషులకూ సోకుతున్న జంతువుల జ్వరం, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త


Also read: నిమ్మకాయ ధర పెరిగిందిగా, దాని బదులు ఇవి తినండి, ఎంతో ఆరోగ్యం కూడా