Peddapalli Crime : పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జోన్ బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో డీసీపీ అఖిల్ మహాజన్, ఎసీపీ ఎడ్ల మహేష్ లు నిందితుడి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తాళ్ల గూరిజాల పోలీసు స్టేషన్ పరిధిలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని తనిఖీ చేయగా ఒక సంచిలో విలువైన బంగారు నగలు ఉన్నాయి. వాటి గురించి ప్రశ్నించగా అతను సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు అతడ్ని విచారించారు. దీంతో అతడు బెల్లంపల్లి చుట్టుపక్కల ఇళ్లలో దొంగతాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. 



బస్టాండ్ ఉంటూ చోరీలు 


నిందితుడు 2009లో కల్లూర్ గ్రామంలో ఒక యజమాని ఇంట్లో పని కుదుర్చుకొని మొదటిసారిగా అతని ఇంట్లో రూ.10 వేలు దొంగతనం చేసి పట్టుపడి జైలుపాలు అయ్యాడు.  ఆ తర్వాత నిందితుడు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దొంగతనాలు చేసి జైలుపాలు అయ్యాడు. తన పంథా మార్చుకొని కొత్త ప్రాంతంలో దొంగతం చేస్తే ఎవరు గుర్తుపట్టరని బెల్లంపల్లి పట్టణాన్ని ఎంచుకొని, బెల్లంపల్లి చుట్టూ పక్కల ప్రాంతాల్లో దొంగతనాలు మొదలుపెట్టాడు. మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వే, బస్ స్టాండ్ లలో ఉంటూ రాత్రుళ్లు దొంగతనాలు చేస్తున్నాడు. బెల్లంపల్లి-1 టౌన్ ఏరియాలో రెండు దొంగతనాలు, తాళ్ళగూరిజల పోలీసు స్టేషన్ పరిధిలో రెండు, తాండూర్ పోలీసు స్టేషన్ పరిధి లో ఒక దొంగతనం చేసి బంగారు, వెండి, నగదు ఎత్తుకెళ్లాడు. దొంగతనం చేసిన సొత్తులో తక్కువ ధరకు గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకొని, వాటితో వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. నిందితుని వద్ద నుంచి 14 తులాల బంగారు ఆభరణాలు వీటి విలువ 7,50,000/- రూపాయలు స్వాధీనపర్చుకొని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితుడు కొమ్మన బోయిన సీతారాములు(30), తండ్రి పేరు పెరుమయ్య అని పోలీసులు గుర్తించారు. 



పోలీస్ స్టేషన్ వారీగా నిందితుడిపై కేసులు


కల్లూర్ -2, సత్తుపల్లి-1, కొత్తగూడెం-II టౌన్-2 నందిగామ-1, కణిజెర్ల-1, గుర్రం పోడు-1, చండూరు-1, మహబూబ్ బాద్-1, సూర్యపేట-2, వరంగల్-2, హుజూర్నగర్-2, నల్గొండ -2, జగ్గయ్యపేట-1, పెనుగంటిప్రోలు-1, గంపల గూడెం-1


బెల్లంపల్లి ఏరియాలో వరుస దొంగతనలు అవుతున్నాయని అసిస్టెంట్ కమిషనర్  ఏ.మహేశ్ నిందితున్ని పట్టుకోవడానికి  ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా తనిఖీల్లో నిందితున్ని పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు.