తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో యాత్ర చేస్తున్న ఆయన ఇవాళ ఇటిక్యాల మండలంలోని వేముల చేరుకున్నారు. ఓ వైపు ఆయనకు బీజేపీ లీడర్లు ఘన స్వాగతం చెబుతుంటే.. మరోవైపు టీఆర్‌ఎస్‌ లీడర్లు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.






అటు బీజేపీ శ్రేణులు, ఇటు టీఆర్‌ఎస్ కేడర్‌ పోటాపోటీ నినాదాలతో వేములలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలు ఎవరూ వెనక్కి తగ్గకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఒకానొక దశలో ఒకరిపై ఒకరు దాడులకు కూడా తెగబడ్డారు. కనిపించన వాహనాలను ధ్వంసం చేశారు. రెండు పార్టీలకు చెందిన నేతల కార్లు ధ్వంసమయ్యాయి. 






పోలీసులు జోక్యం చేసుకొని అతి కష్టమ్మీద ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించారు. అందర్నీ నచ్చచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కొందరు బీజేపీ లీడర్లను, టీఆర్‌ఎస్‌ నేతలను అరెస్టు చేయాల్సి వచ్చింది. 






ఈ చర్యలను బీజేపీ నేతలు ఖండించారు. పాదయాత్రకు వ్యతిరేకంగా అధికార పార్టీ నేతలు వచ్చి ధర్నాలు చేయడాన్ని ఖండించారు. ఇది మంచి సంప్రదాయం కాదని.. ఇలా చేస్తే బీజేపీ సత్తా కూడా చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.  


బీజేపీ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారి మండిపడుతున్నారు బీజేపీ లీడర్లు. తాము చేస్తున్న పాదయాత్రకు జనస్పందన చూసి కేసీఆర్‌కు ఫీవర్ వచ్చిందంటున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తాము అధికారంలోకి వస్తే నకిలీ విత్తనాల గోల ఉండదన్నారు. కేసీఆర్ చేస్తున్న దందాలు బంద్ చేస్తామన్నారు.  అలంపూర్‌పై కేసీఆర్ వివపక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. కోట్లు ఖర్చు పెట్టి తన ఫామ్ హౌస్‌కు గోదావరి జలాలు తెప్పించుకున్న కేసీఆర్‌... గద్వాల్‌కు ఎందుకు నీరు తెప్పించడం లేదని ప్రశ్నించారు. ఆర్డీఎస్ ఆధునీకరిస్తే మహబూబ్‌నగర్ కరవు తీరిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తీసుకుపోతున్నా ప్రశ్నించలేని దుస్థితిలో కేసీఆర్ ఉన్నారన్నారు. 






అసత్య ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్‌ను ఎక్కడికక్కడ నిలదీస్తామంటున్నారు టీఆర్‌ఎస్ లీడర్లు. ఒక్క బండి సంజయ్‌నే కాదని బీజేపీ లీడర్లందర్నీ అడ్డుకుంటామంటున్నారు. తెలంగాణ రైతులు ఇప్పటికే అరవింద్ లాంటి వాళ్లను నిలదీస్తున్నారని గుర్తు చేశారు.