ఒక ఇంటిని కొంటేనే ఎంతో ఆనందపడిపోతాం, అలాంటి ఒక ఊరినే కొంటే మీరే యజమాని. ఒక రాజ్యాన్ని పాలించినంత ఆనందంగా ఉంటుంది. ఊరిని అమ్ముతున్నారనగానే అందులో ఏమీ ఉండవు అనుకోవద్దు. ఎన్నో ఇళ్లు, చర్చి, బతకడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. చుట్టూ పచ్చని అందాలు కూడా. ఈ ఊరికి మూడు వైపులా సన్నగా సాగే వాగులు ఎంతో అందంగా ఉంటాయి. ఒకసారి వెళ్లారంటే ఆ పచ్చని సౌందర్యానికి దాసోహం అయిపోతారు. ఇంతకీ ఇది ఎక్కడుంతో చెప్పలేదు కదూ, స్పెయిన్లో. ఆ గ్రామం పేరు సాల్డో డి క్యాస్ట్రో. ఇది పోర్చుగీసు సరిహద్దుల్లో ఉంది. 


ఎందుకు అమ్ముతున్నారు?
అంత అందమైన ఊరు అయినప్పటికీ, ఇళ్లు, వాకిళ్లు బావున్నప్పటికీ అందులో జనాలు ఎవరూ నివసించడం లేదు. తిరిగి ప్రజలతో నింపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. విడి విడి ఇళ్లు అమ్మడానికి ప్రయత్నించారు అలా కూడా ఎవరూ కొనలేదు. చివరికి ఇలా ఊరికి ఊరినే అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఈ ఊళ్లో 44 ఇళ్లు ఉన్నాయి. అంటే 44 పెద్ద కుటుంబాలు సంతోషంగా నివసించగలవు. అలాగే ఒక స్కూలు, చర్చి, హోటల్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. అన్ని వసతులు ఉన్నా కూడా ఇక్కడ ఎవరూ ఉండడం లేదు. ఇప్పటికి ముప్పయ్యేళ్లయింది ఇక్కడ జనాలు నివసించి. 


ఎందుకు ఖాళీ అయింది?
చాలా ఏళ్ల క్రితం ఇక్కడ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దానికి పనిచేయడానికి కావాల్సిన ఉద్యోగులను, కార్మికులను ఇక్కడికి కుటుంబంతో సహా తరలించారు. వారి కోసం ఈ గ్రామాన్ని నిర్మించారు. ఆ నిర్మాణం పూర్తయ్యే దాకా ఇక్కడే ఉన్న కుటుంబాలు పూర్తవ్వగానే తమ ఊళ్లకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఊరు ఖాళీ అయిపోయింది. దీన్ని ఇరవయ్యేళ్లుగా ప్రజలతో నింపడానికి ప్రయత్నించారు అధికారులు కానీ వీలు కాలేదు. 






ధర ఎంతంటే...
ఇక ప్రజలు ఇక్కడికి రారని నిర్ణయించుకున్న స్పెయిన్ అధికారులు ఊరి మొత్తాన్ని అమ్మేయాలనుకున్నారు. మొదట 6.5 మిలియన్ యూరోలుగా ధర నిర్ణయించారు. అంటే మన రూపాయల్లో 560 కోట్లు. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అలా ధర తగ్గించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం చివరగా కేవలం రెండు కోట్ల 24 లక్షలకు అమ్మేయడానికి నిర్ణయించారు. అంటే మన హైదరాబాద్లోని కొన్ని ఏరియాల్లో ఒక ఫ్లాట్ కొన్నంత ధర అన్నమాట. పెద్ద కుటుంబంతో వెళ్లి అక్కడ సెటిల్ కావచ్చు. ఏ దేశస్థులైనా కొనుక్కునే సదుపాయాన్ని కూడా ఇచ్చారు స్పెయిన్ అధికారులు. 


Also read: జొన్నపిండితో టేస్టీ కేకు రెసిపీ - పిల్లలు ఎంత తిన్నా బెంగలేదు