కొత్త ఏడాది వచ్చిదంటే ఇంట్లో కేకు తయారు చేసేందుకు ఎంతో మంది రెడీ అవుతుంటారు. అయితే మైదా పిండిని వాడుతుంటారు. ఇది ఆరోగ్యానికి హానికరం. అందుకే జొన్న పిండితో ఈసారి ప్రయత్నించండి. పిల్లల ఎంత తిన్నా దగ్గు వస్తుందేమో, కఫం పట్టేస్తుందేమో అన్న భయం అవసరం లేదు. రకరకాల అనారోగ్య సమస్యలు ప్రపంచంలో తొంగి చూస్తున్నప్పుడు ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మైదా వాడడం మానేసి జొన్నపిండితో కేకు తయారు చేయాలి. అన్నట్టు ఇందులో పంచదార కూడా వాడడం లేదు. కాబట్టి ఇంకా ఆరోగ్యకరం.  


కావాల్సిన పదార్థాలు
జొన్న పిండి - ఒక కప్పు
క్యారెట్ తురుము - ఒక కప్పు
అరటి పండ్లు - రెండు
పాలు - అర కప్పు
బెల్లం పొడి - కప్పు
బటర్ - 3 టీ స్పూన్లు
బేకింగ్ పొడి - అర స్పూను
బేకింగ్ సోడా - అర స్పూను
బాదం పప్పులు - అర కప్పు
దాల్చిన చెక్క పొడి - అర స్పూను
ఉప్పు - చిటికెడు


తయారీ ఇలా...
1. స్టవ్ పై కళాయి పెట్టి చాలా చిన్న మంట పెట్టాలి. అందులో జొన్న పిండిని వేసి మాడి పోకుండా కాస్త దోరగా వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల కేకు పచ్చి వాసన రాకుండా ఉంటుంది. 


2. అరటి పండ్లను చేత్తో నలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. వేయించిన జొన్న పిండిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. 


3. ఆ గిన్నెలో అరటి పండ్ల పేస్టు, కాస్త బటర్ వేసి బాగా కలపాలి. విస్కర్ సాయంతో అయితే బాగా కలుస్తాయి. చేత్తో గిలక్కొట్టడం కష్టం. 


4. అందులో బేకింగ్ సోడా, బేకింగ్ పొడి, దాల్చిన చెక్క పొడి కూడా మళ్లీ గిలక్కొట్టాలి. 


5. బెల్లం పొడి, క్యారెటు తురుము వేసి కలపాలి. 


6. ఇప్పుడు గోరు వెచ్చని పాలు వేసి బాగా గిలక్కొట్టాలి. మరీ మందంగా కాకుండా, అలాగే మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. 


7. కేక్ మౌల్డ్‌కు కాస్త వెన్న రాసి పైన చిటికెడు జొన్న పిండి వేసి, కేకు మిశ్రమాన్ని అన్నివైపులకు సమానంగా సర్దాలి. బాదం పప్పులు పైన చల్లాలి. 


8. ముందుగా మైక్రో ఓవెన్‌ను 180 డిగ్రీలు ప్రీ హీట్ చేసుకోవాలి. అందులో కేకు మౌల్డ్ పెట్టాలి. 


9.  సరిగ్గా 45 నిమిషాల పాటూ ఉంచితే కేకు సిద్ధమవుతుంది. 


ఓవెన్ లేకపోతే...
ఓవెన్ లేకపోయినా కూడా కుక్కర్లో కేకును చేసుకోవచ్చు. 
1. కుక్కర్ అడుగు భాగంలో మెత్తటి ఇసుక లేదా రాళ్ల ఉప్పు వేయాలి. మూత పెట్టి ప్రీ హీట్ చేసుకుంటే మంచిది. 
2. తరువాత మూత తీసి కేకు మౌల్డ్‌ను అందులో పెట్టి, కుక్కర్ మూత పెట్టేయాలి. 
3. దాదాపు నలభై నిమిషాల పాటూ చిన్న మంట మీద ఉడికించాలి. 
4. ఒక సన్నని టూత్ పిక్ తో గుచ్చితే, దానికి ఏమీ అతుక్కోకుండా వస్తే కేకు రెడీ అయినట్టే. 
5. ఇప్పుడు కేకు చల్లారాక తీసి ఒక ప్లేటులో వేయాలి. అంతే కేకు రెడీ అయినట్టే. ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ మీరే వండుతారు.  



Also read: అప్పటికప్పుడు చేసుకుని తినేలా కంది పప్పు దోశలు -రుచి అదిరిపోతుంది