మినప, పెసర పప్పులనే ఎక్కువ మంది అట్లు, దోశెల్లా వేసుకుని తింటారు. కానీ కందిపప్పుతో కూడా టేస్టీ దోశెలు, అట్లు వేసుకుని తినవచ్చు. ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడే ఇన్‌స్టంట్‌గా వీటిని వేసుకుని తినవచ్చు. కంది పప్పు, బియ్యం ఉంటే చాలు ఈ దోశెలు రెడీ అయిపోతాయి. కంది పప్పుతో దోశెలేంటి అని పెదవి విరవకుండా ఒకసారి వేసుకుని తినండి , దాని రుచికి మీరే దాసోహమైపోతారు. 

కావాల్సిన పదార్థాలుకంది పప్పు -  అర కప్పుబియ్యం - ఒక కప్పుకాస్త పుల్లటి మజ్జిగ - ఒక కప్పుకొత్తిమీర తరుగు - మూడు స్పూన్లుఉప్పు - రుచికి సరిపడాపచ్చిమిరపకాయలు - రెండుజీలకర్ర - ఒక స్పూనువంట సోడా - చిటికెడు

తయారీ ఇలా1. కంది పప్పు, బియ్యం కలిపి మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. 2. ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు. మిక్సీలో ఎంత వరకు పొడిలా అవుతుందో అంతవరకు చేయండి. కాస్త బరకగా అయినా సరే ఫర్వాలేదు తీసుకోండి. ఎందుకంటే కందిపప్పు మెత్తటి పొడిలా మిక్సీలో అవ్వకపోవచ్చు. 3. ఒక గిన్నెలో ఆ పొడిని వేసి పుల్లటి మజ్జిగని వేసి బాగా గిలక్కొట్టాలి. 4. అట్లు వేసుకోవడానికి ఎంత మందం కావాలో అంతవరకు మజ్జిగను కలుపుకోవచ్చు. 5. ఆ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు వేసి కలుపుకోవాలి. 6. చిటికెడు వంట సోడా కూడా వేసుకుంటే మంచిది. వంటసోడా లేకపోతే ఈనో ప్యాకెట్ ఉన్న వాడుకోవచ్చు. 7. పెనంపై ఈ మిశ్రమాన్ని అట్లులా పోసుకోవాలి. రెండు వైపులా బంగారు వర్ణంలోకి మారాకా తీసి ప్లేటులో వేసుకోవాలి. 8. ఈ కంది పప్పు దోశెలు కొబ్బరి చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి. 

తింటే ఎంతో బలం...కంది పప్పు దోశెలు పిల్లలకు చాలా బలాన్నిస్తాయి. అల్పాహారంలో ఎంతో శక్తి వంతమైన ఆహారం తినాలని చెబుతారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే దీనిలో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్ శరీరానికి చాలా అవసరం. ఫైబర్ కూడా అవసరం. ఇందులో కొలెస్ట్రాల్, శాచురేటెడ్ ఫ్యాట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కందిపప్పులో ఉండే ఫైబర్ శరీరం నుంచి కొలెస్ట్రాల్ ను బయటికి పంపేందుకు సహకరిస్తుంది. కంది పప్పు దోశెలు తిన్నాక ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లు వీటిని అల్పాహారంలో తింటే మంచిది. కంది పప్పులో ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, బీ కాంప్లెక్స్ వంటివి ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అవసరమైనవే. కంది పప్పు తినడం వల్ల ప్రొటీన్ కొరత రాకుండా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా మారేందుకు కంది పప్పు చాలా అవసరం. ఇందులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. పిల్లలకు కంది పప్పు రోజూ తినిపిస్తే చాలా మంచిది. పప్పు, సాంబారు, దోశెల రూపంలో వారికి తినిపించాలి.

Also read: మీకు ఆందోళనగా, దిగులుగా అనిపిస్తోందా? అయితే ఈ రెండు లోపాలు ఉన్నట్టే