ఏదైనా సమస్య ఉంటేనే మానసిక ఆందోళనలు, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు వస్తాయనుకుంటే పొరపాటే. పోషకాహార లోపం కూడా వీటికి కారణం కావచ్చు. ముఖ్యంగా రెండు పోషకాల లోపాల వల్ల ముఖ్యంగా మానసిక సమస్యలు వస్తాయి. అందులో ఒకటి ఇనుము, రెండో విటమిన్ బి12. రెండు కూడా శరీరంలో రక్తం వృద్ధికి, మెరుగైన పనితీరుకు చాలా అవసరం. రక్తం తగ్గడం వల్ల వచ్చే అనేక వ్యాధులను ఈ రెండు పోషకాలు నివారిస్తాయి. వీటిలో విటమిన్ బి12ను కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఆఇది ఎర్రరక్తకణాలను, డీఎన్ఏను ఏర్పరిచే ముఖ్యమైన పోషకం. అలాగే ఇనుము కూడా శరీరభాగాలకు ఆక్సిజన్‌ను మోసుకెళ్లే మరొక ప్రధాన పోషకం. ఈ రెండూ కూడా శరీరానికి అత్యవసరమైనవి. ఈ రెండూ లోపిస్తే ముఖ్యంగా స్త్రీలలో వెంటనే ప్రభావం కనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం ఆ ప్రభావం తీవ్రంగా పడుతుంది. మానసిక ఆందోళన ఎక్కువైపోతుంది. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటివి తొంగి చూస్తాయి.
వాటి మధ్య బంధం?
ఐరన్, విటమిన్ బి12 లోపానికీ, మానసిక ఆరోగ్యానికి ఏమిటి కనెక్షన్? దీనిపై చాలా అధ్యయనాలు జరిగాయి. ఐరన్ లోపించడం వల్ల డిప్రెషన్ బారిన అవకాశాలు ఎక్కువని ఎన్నో అధ్యయనాలు ఇప్పటికే నిరూపించాయి. ఇనుము లోపించడం వల్ల న్యూరోట్రాన్స్ మీటర్, మూడ్ స్టెబిలైజర్‌గా పనిచేసే సెరోటోనిన్ తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల అభిజ్ఞా సమస్యలు, విచారంగా ఉండడం, శ్వాస సరిగా ఆడకపోవడం, కండరాల బలహీనత, మానసిక, శారీరక అలసట కలుగుతుంది. మూడు నెలలకోసారైనా ఇనుము, బి12 వంటి అత్యవసరం విటమిన్లు, ఖనిజాల లోపం ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. రక్త పరీక్ష ద్వారా వీటిని చెక్ చేస్తారు. దాన్ని బట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఆయుర్వేదం ఏం చెబుతోంది...
ఆయుర్వేదం కూడా పైన చెప్పిన విషయాన్ని ధ్రువీకరిస్తోంది. మానసిక ప్రవర్తనలను ప్రభావితం చేసే మెదడు పనితీరుకు ఇనుము చాలా అవసరం, కాబట్టి ఇనుము తగ్గితే ఆందోళన, నిరాశ పెరుగుతాయి అని వివరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. రక్తహీనత శరీరాన్ని చాలా ఒత్తిడికి గురిచేస్తుంది. మెదడు చురుగ్గా లేకుండా మబ్బుగా ఉండేలా చేస్తుంది.
ఏం తినాలి?
ఐరన్, బి12 లోపం రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలు రోజూ తినాలి.
1. ఆకు కూరలు
2. నట్స్
3. చేపలు
4. చికెన్
5. గుడ్లు
6. బీన్స్
7. బఠానీలు
8. పప్పులు
9. ఓట్స్
10. చీజ్
Also read: ఈ చిత్రంలో చేప ఉంది కనిపించిందా? 30 సెకన్లలో కనుక్కుంటే మీరు తెలివైన వారే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.