అన్ని ఊళ్లలో మనుషులుంటారు కానీ మనిషి ఆకారంలో ఉండే గ్రామాన్ని ఎప్పుడైనా చూశారా? ఇటలీలోని ఎన్నా ప్రావిన్సులో ఉంది ఈ గ్రామం. ప్రపంచంలో ఇలా మనిషి ఆకారంలో ఉన్న గ్రామం ఇదొక్కటే. పేరు సెంటూరిపే. నిజానికి ఈ ఊరు వందల ఏళ్ల నుంచి ఉంది. కానీ ఎవరికీ ఆ ఊరి ఆకారం తెలియదు. ఆ గ్రామంలో ఉండే ఫోటోగ్రాఫర్ పియో ఆండ్రియా గూగుల్ ఎర్త్ మన ఊరి మ్యాప్ ను చూశారు. మొదట స్టార్ ఫిష్ ఆకారంలో ఉండే అనుకున్నారు. డ్రోన్ సాయంతో పలు చిత్రాలను తీశారు. తీరా చూస్తే అది స్టార్ షిఫ్ లా కాదు మనిషి ఆకారంలో ఉన్నట్టు తేలింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వెంటనే అవి వైరల్ గా మారాయి. సెంటూరిపే కొన్ని రోజుల పాటూ ట్రెండయ్యింది. ఈ గ్రామంలో కేవలం 5000 మంది జనాభా ఉంటారు. సముద్ర మట్టానికి 2,400 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ గ్రామం.
ఈ గ్రామాన్ని కాస్త ఎత్తయిన కొండల మీద నుంచి చాలా అందంగా కనిపిస్తుంది. అదే మనిషి ఆకారం కనిపించాలంటే మాత్రం హెలికాఫ్టర్ మీద నుంచి చూడాల్సిందే. ఈ విలేజ్ ఇప్పుడు పర్యాటకులను తెగ ఆకర్షిస్తోంది. ప్రకృతి అందాలకు నెలవైన సెంటూరిపేలో అందమైన జలపాతాలు ఉన్నాయి. రోమన్ల నాటి రెండు వంతెలను ఇప్పటికీ పటిష్టంగా ఉండడం గమనార్హం. వాటిని చూసేందుకు ఏటా పర్యాటకులు వచ్చి పోతుంటారు.
కొంతమంది ఆ గ్రామాన్ని ఏలియన్ గ్రామంగా పిలుస్తారు. భారీ మనిషి ఆకారంలో ఉన్నది కాబట్టి ఈ గ్రామాన్ని ఇలా ఏ గ్రహాంతరవాసో డిజైన్ చేసి ఉంటాడని ఆ ఊళ్లో చాలా మంది భావిస్తారు. ఆ గ్రామాన్ని ఎవరో అలా డిజైన్ చేశారని అనుకుంటారు కానీ, నిజానికి అనుకోకుండా అలా గ్రామం పెరుగుతూ వెళ్లింది.