పాశ్చాత్య దేశాల్లోని ప్రజల్లో ఈరోజు ఒక అశుభదినం. కారణం 13వ తేదీ శుక్రవారం పడింది. ఎప్పుడైనా 13వ తేదీ శుక్రవారం పడితే దాన్ని వారు  దురదృష్టకరమైన రోజుగా పరిగణిస్తారు.ఆ రోజున చాలా మంది బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. శుక్రవారం, 13 వతేదీ భయానికి కూడా ఒక పేరుంది... పారాస్కేవిడెకాట్రియా ఫోబియా. ఈ ఫోబియా పాశ్చాత్య దేశాల ప్రజల్లో చాలా మేరకు ఉంది. ముఖ్యంగా బ్రిటన్ ప్రజల్లో మరీ ఎక్కువ. ఈ రోజున బ్రిటన్ వాసుల్లో చాలా మంది బయటికి వచ్చేందుకు కూడా ఇష్టపడరు. వారికేదో కీడు జరుగుతుందని భావిస్తారు. 


ఏం జరుగుతుంది?
13వ తేదీ శుక్రవారం పడితే ఎందుకు డేంజరో తెలుసుకునేందుకు 1993లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఒక అధ్యయనం చేసింది. విచిత్రంగా ఆ అధ్యయనంలో శుక్రవారం, 13 వతేదీ చుట్టూ చాలా అశుభాలు జరిగే అవకాశం ఉన్నట్టు తేలింది.  వ్యక్తుల ఆరోగ్యం, ప్రవర్తన, మూఢనమ్మకాలు వంటి విషయాలను పరిగణనలోకి అధ్యయనం నిర్వహించారు. 13వ తేదీ శుక్రవారంనాడు యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతాయని, సాధారణ శుక్రవారాలతో పోలిస్తే 52 శాతం ఎక్కువ ప్రమాదాలు జరిగి ఆసుపత్రిలో చేరే అవకాశం ఉందని ఆ పరిశోధనలో తేలింది. దీంతో నిపుణులు 13వ తేదీ శుక్రవారం పడితే కచ్చితంగా ఇంట్లోనే ఉండాలని అప్పట్లో సిఫారసు కూడా చేశారు అప్పట్లో. 


ఇదే కథ...
పాశ్చాత్యదేశాలకు చెందిన ఒక పురాణం ప్రకారం 12 మంది దేవుళ్లు వల్హలా అని పిలిచే చోట విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో మరో దేవుడైన లోకి (థోర్ సినిమాలో లోకి పాత్రకు ఈ దేవుడే స్పూర్తి) పిలవని పేరంటంలా 13వ అతిధిగా వచ్చాడు. లోకి మోసగాడిగా పేరు పొందిన దేవుడు. అక్కడికి వచ్చాక ఆనందానికి అధిపతి అయిన బాల్డర్ ది బ్యూటిఫుల్ ను చంపడానికి ప్లాన్ వేశాడు. అందుకు చీకటికి అధిపతి అయిన హోడర్‌ చేత బాల్డర్ ను చంపించాడు. బాల్డర్ మరణం తరువాత శోక సంద్రంలో మునిగి భూమి మొత్తం చీకటితో నిండిపోయింది.లోకి 13వ అతిధిగా వచ్చాకే ఇలా జరిగింది కాబట్టి 13ను అశుభ సంఖ్యగా భావించడం మొదలుపెట్టారు. అలాగే యేసుకు శిలువ వేయడానికి ముందు జెరూసలేంలో తన ఆప్తులతో చివరి భోజనం చేస్తుండగా 13 వ అతిధిగా జుడాస్ అనే వ్యక్తి వచ్చాడు. అతడే యేసుకు ద్రోహం చేశాడని చెబుతారు. ఈ కథ వల్ల కూడా 13వ తేదీని అశుభంగా భావిస్తారు.  ఈ 13వ తేదీ శుక్రవారం పడితే మరింతగా చెడు జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది. 
 
కొంతమంది ప్రజల్లో పారాస్కేవిడెకాట్రియా ఫోబియా ఉన్నట్టు గురించారు పరిశోధకులు. వారు సాధారణ రోజుల్లో అందరిలాగే ఉంటారు. కానీ 13వ తేదీ శుక్రవారం వచ్చిందటే అధికంగా భయాందోళనలకు గురవుతారు. ఇంట్లోంచి బయటికి రారు. అలా వస్తే తాము ప్రమాదాలకు గురవుతామని నమ్ముతారు. ఈ ఫోబియాకు కూడా చికిత్స ఉందని చెబుతున్నారు నిపుణులు. అన్ని ఫోబియాలను పొగొట్టినట్టే దీన్ని కూడా పోయేలా చేయవచ్చని చెబుతున్నారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఎక్స్ పోజర్ థెరపీ, సైకో థెరపీ వంటి చికిత్సలతో మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. 


అదృష్టం అనేది ఒక మాయా శక్తి అని, అది ఊహల్లోనే ఉంటుందని తెలిపారు. మనం ఆలోచించే విధానంపైనే అదృష్టం, దురదృష్టం అనేవి ఆధారపడి ఉంటాయని తెలిపారు. 


Also read: ఆఫీసులో రోజుకో అరగంట హాయిగా నిద్రపొమ్మంటున్న సంస్థ, పవర్ న్యాప్స్ అంత ముఖ్యమా?


Also read: ట్యూబెక్టమీ లేదా వాసెక్టమీ, పిల్లలు పుట్టకుండా ఏ ఆపరేషన్ బెటర్?