రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మొదలవ్వక ముందు వ్లాదిమర్ జెలెన్ స్కీ పెద్దగా ఎవరికీ తెలియదు. ఆ యుద్ధం మొదలయ్యాక జెలెన్ స్కీ ఎవరో తెలుసుకునేందుకు ప్రపంచదేశాల ప్రజలు ఆసక్తి చూపించారు. రష్యా లాంటి అణుదేశాన్ని తట్టుకుని నిలబడే శక్తి ఉక్రెయిన్‌కు ఇచ్చింది జెలెన్ స్కీయే. ఆయన గుండె నిబ్బరానికి, ధైర్యానికి, దేశ భక్తికి ఉక్రెయిన్ ప్రజలు కూడా దాసోహమయ్యారు. ఇక అగ్రదేశాలు నేరుగా తమ సైనిక శక్తిని పంపించకపోయినా ఆయుధాలిస్తూ అపారమైన సాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు జెలెన్ స్కీ ఓ రియల్ హీరో. 


ఆ జాకెట్...
యుద్ధం మొదలయ్యాక జెలెన్ స్కీ కొన్ని వీడియోలలో జాకెట్ వేసుకుని కనిపిస్తారు. అది ముదురు రంగులో ఉంటుంది. జెలెన్ స్కీతో పాటూ ఆ జాకెట్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఆ జాకెట్‌ను లండన్లో వేలం పాట వేశారు. ఉక్రెయిన్ కోసం నిధుల సమీకరణ చేసేందుకు  ఈ వేలం పాటను నిర్వహించారు.జెలెన్ స్కీ ఆ జాకెట్ పై ఆటోగ్రాఫ్ కూడా చేశారు. రష్యన్ దళాలు కీవ్ నగరంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జెలెన్ స్కీ ఈ జాకెట్‌ను ధరించి కీవ్ వీధుల్లో తిరిగారు. ఆ జాకెట్ అనేక వీడియోలలో కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ వీడియోలు ప్రాచుర్యం పొందాయి. ఈ జాకెట్ 90,000 పౌండ్లకు అమ్ముడుపోయింది. అంటే మన రూపాయల్లో 85 లక్షలు.  


యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఉక్రెనియన్ ఎంబసీ తన అధికారిక ట్విట్టర్ లో ఈ ఉన్ని జాకెట్ గురించి పోస్టు పెట్టింది. ‘రష్యా ఉక్రెనియన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆ యుద్దం మూడు రోజుల్లో ముగిసిపోతుందని అనుకున్నారు. కానీ ఆ యుద్ధం రెండు నెలలు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది’ అని రాసుకొచ్చింది. ‘ఈరోజు ప్రపంచం మొత్తం ఓ సాధారణ ఉన్ని జాకెట్ ధరించిన వ్యక్తి వైపు చూస్తోంది. ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సంతకం చేసిన ఐకానిక్ ఐటెమ్ ఇదిగో’ అని ఆ జాకెట్ జెలెన్ స్కీ వేసుకున్న వీడియోలను పోస్టు చేసింది. 


ఈ వేలం పాట ద్వారా వచ్చే డబ్బులను ఉక్రెనియన్లోని స్పెషలైజ్డ్ చిల్డ్రన్స్ మెడికల్ సెంటర్ రీ ఎక్విప్మెంట్ కోసం ఉపయోగించాలని భావిస్తున్నారు. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఈ వేలం పాటకు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘ ఆధునిక కాలంలో అత్యంత అద్భుతమైన నాయకుల్లో జెలెన్ స్కీ ఒకరు’ అని చెప్పారు. 





Also read: 13వ తేదీ శుక్రవారం పడితే జనాలకు ఎందుకు భయం? ఈ రోజును అరిష్టంగా ఎందుకు భావిస్తారు?


Also read: ఆఫీసులో రోజుకో అరగంట హాయిగా నిద్రపొమ్మంటున్న సంస్థ, పవర్ న్యాప్స్ అంత ముఖ్యమా?