IPL 2022, CSK vs MI: వికెట్‌, పిచ్‌ ఎలాగున్నా 130 కన్నా తక్కువ పరుగుల్ని డిఫెండ్‌ చేసుకోవడం కష్టమని చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ అంటున్నాడు. బౌలర్లను రిజల్టు గురించి ఆలోచించొద్దని చెప్పానన్నాడు. ఏదేమైనా మ్యాచ్‌ ఆడినంత సేపు తెగువ చూపించాలని కోరినట్టు వెల్లడించాడు.


'తక్కువ స్కోరు డిఫెండ్‌ చేయడం కష్టం. అందుకే బౌలర్లను తమ తెగువ చూపించాలని అడిగా. ఫలితం గురించి పట్టించుకోవద్దని సూచించా. ఇద్దరు యువ ఫాస్ట్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. పరిస్థితులతో సంబంధం లేకుండా వారిని వారు నమ్మేందుకు ఈ మ్యాచ్‌ ఉపయోగపడుతుందని భావించా. మేం ఎప్పుడు మ్యాచ్‌లు మొదలు పెట్టినా ఇలాంటి యాటిట్యూడే అవసరం. పొట్టి క్రికెట్లో ఇదే ముఖ్యం' అని ధోనీ అన్నాడు.


'ఐపీఎల్‌లో అద్భుతమైన ఫాస్ట్‌ బౌలర్లు బెంచ్‌పై లేని దశను మేం అనుభవించాం. అంతేకాకుండా వారు పరిణతి సాధించడానికి సమయం పడుతుంది. అదృష్టం బాగుంటే కొందరు కుర్రాళ్లకు అన్ని ఫార్మాట్లలో ఆరు నెలలు ఆడుతున్నారు. ఐపీఎల్‌ వల్ల అలాంటి అవకాశాలు వస్తున్నాయి. ముంబయి మ్యాచులో ఆ ఇద్దరు కుర్ర బౌలర్లు ధైర్యంగా బౌలింగ్‌ చేశారు. పొట్టి ఫార్మాట్లో కావాల్సింది అదే. ప్రణాళికలు అమలు చేసేందుకు మరికొందరికి కొంత సమయం అవసరం అవుతుంది. వచ్చే సీజన్లో మాకు మరో ఇద్దరు పేసర్లు అందుబాటులో ఉంటారు. వారు ప్రిపేర్‌ అయ్యేందుకు సమయం ఇవ్వాలని అనుకుంటున్నాం. మేం మరికాస్త మెరుగ్గా బ్యాటింగ్‌ చేయాల్సింది' అని ధోనీ పేర్కొన్నాడు.


ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 15.5 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ముంబై ఇండియన్స్ 14. ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


98 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి కూడా ఆరంభంలో కష్టాలు ఎదురయ్యాయి. కేవలం 33 పరుగులకే ఎంఐ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తిలక్ వర్మ (34 నాటౌట్: 32 బంతుల్లో, నాలుగు ఫోర్లు), హృతిక్ షౌకీన్ (18: 23 బంతుల్లో, రెండు ఫోర్లు) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. విజయానికి కొద్ది దూరంలో షౌకీన్ అవుటయినా... టిమ్ డేవిడ్ (16 నాటౌట్: 7 బంతుల్లో, రెండు సిక్సర్లు) రెండు సిక్సర్లతో మ్యాచ్ ముగించాడు. చెన్నై బౌలర్లలో ముకేష్ చౌదరి మూడు వికెట్లు తీయగా... సిమర్ జిత్ సింగ్, మొయిన్ అలీలకు చెరో వికెట్ దక్కింది.