మధ్యప్రదేశ్లోని మారుమూల గ్రామం అస్లానా. ఉజయినీ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ చిన్న గ్రామం. ఈ గ్రామంలో కరెంటు తరచూ పోతుంటుంది. ముఖ్యంగా రాత్రి వేళలో మరీ పోతుంది. అలా ఓ పెళ్లి జరుగుతున్నప్పుడు కరెంటు పోయింది. దీంతో పెద్ద తప్పు జరిగిపోయింది. ఆ తప్పు మరుసటి రోజు తెల్లారే వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. తెలిశాక తలలు పట్టకున్నారు. అసలేం జరిగిందంటే...


అస్లానా గ్రామంలో కుటుంబంతో జీవిస్తున్నాడు రమేష్ లాల్. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. పేర్లు నికితా, కరిష్మా. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేయాలనుకున్నాడు. వేర్వేరు కుటుంబాలకు చెందిన అబ్బాయిలను ఎంపిక చేశాడు. అందరూ ఇష్టపడడంతో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారు. పెళ్లిరోజు రానే వచ్చింది. పెళ్లికూతుళ్లిద్దరూ నెత్తి మీద గూంగట్లు (తలమీద నుంచి కప్పుకునే ముసుగు) వేసుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. ఇద్దరూ ఒకేలాంటి చీరలు కట్టుకున్నారు. పెళ్లి కుమారులిద్దరూ వచ్చారు. సరిగ్గా పెళ్లి క్రతువు సమయానికి గ్రామంలో కరెంటు పోయింది. పెళ్లి తంతు నడిపించారు పెద్దలు. ఆ చీకట్లో ముఖాలు పోల్చుకోలేకపోయిన పెళ్లి కొడుకులు అక్కను చేసుకోవాల్సిన వ్యక్తి చెల్లిని, చెల్లిని చేసుకోవల్సిన వరుడు అక్కను పెళ్లి చేసుకున్నారు. ఆ రాత్రే తమ భార్యలను తీసుకుని ఇంటికి కూడా వెళ్లిపోయారు. 


తెల్లారాక చూస్తే ఇంకేముంది అక్క వెళ్లాల్సిన ఇంటికి చెల్లి, చెల్లి వెళ్లాల్సిన అత్తారింటికి అక్క వెళ్లారు. వారి భర్తలు తప్పు జరిగిపోయినట్టు గుర్తించారు. తాము పెళ్లి చూపుల్లో చూసినది ఈ అమ్మాయిని కాదంటూ గోల పెట్టారు. దీంతో పెద్దల్లో పంచాయతీ జరిగింది. తిరిగి పట్ట పగలు అందరి ముందు పెళ్లి చూపుల్లో అనుకున్న ప్రకారం మళ్లీ వివాహం చేశారు. దీంతో పెళ్లి కొడుకులు, వారి కుటుంబాలు శాంతించాయి. ఈ పెళ్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హాట్ టాపిక్ గా మారింది. 


వైరలవుతున్న వేడుకలు
ఈ మధ్య పెళ్లి వేడుకల్లో జరిగిన ఫన్నీ సంఘటనలు, పెళ్లిలో జరిగే గొడవలు బాగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా రాకతో వైరల్ గా అవ్వడం ట్రెండ్ గా మారింది. తాజాగా మరో పెళ్లిలో పెళ్లి కూతురిని ఎత్తి స్విమ్మింగ్ పూల్ లో పడేశారు. ఇది కావాలనే ఫన్నీగా షూట్ చేసిన వీడియో. ఇన్ స్టాలో వైరల్ చేయడం కోసమే ఇలాంటి వీడియోలను చిత్రికరించే వాళ్లు ఉన్నారు. 


Also read: షాకింగ్ రిపోర్టు, మనదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి హైబీపీ


Also read: పిల్లల్లో పెరుగుతున్న ‘టమోటా ఫీవర్’, కేరళలో బయటపడ్డ కొత్త వైరస్, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే