కేరళలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. అయిదేళ్ల లోపు పిల్లలపై ఇది దాడి చేస్తున్నట్టు గుర్తించారు ఆరోగ్య శాఖ అధికారులు. ఈ కొత్త వైరస్ వల్ల ‘టమోటా జ్వరం’, లేదా ‘టమోటా ఫ్లూ’వస్తున్నట్టు కనుగొన్నారు. కేరళలోని కొల్లం నగరంలో దాదాపు 82 కేసులు నమోదైనట్టు గుర్తించారు. ప్రస్తుతానికి ఈ టమోటా ఫీవర్ పక్క రాష్ట్రాల్లో ఇంకెక్కడా నమోదు కాలేదు. కేరళలో మాత్రమే కనిపిస్తోంది. దీనిపై ఇప్పుడు జోరుగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇది అంటు వ్యాధా? ఎలా వ్యాప్తి చెందుతుంది వంటి విషయాలను కనుక్కునే పనిలో ఉన్నారు ఆరోగ్యశాఖ అధికారులు.
ఏమిటీ టమోటా ఫీవర్?
దీన్ని టమోట ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఇదొక వైరల్ ఇన్ఫెక్షన్. వైరల్ వల్ల కలుగుతుంది. ముఖ్యంగా పిల్లల్లోనే వైరస్ ప్రభావం చూపిస్తోంది. ఇది టమాటో జ్వరమా లేక చికెన్ గున్యా, డెంగ్యూ ఫీవర్ అనే అనుమానాలు కూడా ఉన్నాయి. టమోటా ఫీవర్ వచ్చిన పిల్లల్లో చర్మంపై ఎర్నటి దద్దుర్లు, బొబ్బలు వస్తున్నాయి. చర్మం చాలా చికాకు పెడుతోంది. డీ హైడ్రేషన్ కు గురి అవుతున్నాడు.
టమోటా ఫీవర్ అని పేరు రావడానికి కారణం చర్మంపై వచ్చే పొక్కులు, బొబ్బలు ఎర్రగా గుండ్రంగా ఉంటాయి, అవి టమోటోల్లా ఉంటాయని ఆ పేరు వచ్చింది.
లక్షణాలు ఇలా ఉంటాయి?
టమోటా ఫీవర్ వచ్చిన పిల్లల్లో జ్వరం అధికంగా ఉంటుంది. ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు కూడా కలుగుతాయి. విపరీతంగా అలిసిపోతారు. చర్మంపై ఎర్రటి దద్దుర్లు, కొందరిలో బొబ్బలు ఏర్పడతాయి. డీహైడ్రేషన్ కారణంగా నోటిలో చికాకుగా అనిపిస్తుంది. చేతులు, మోకాళ్లు, పిరుదులు రంగు మారిపోతాయి.
వైరస్ సోకితే ఏం చేయాలి?
పిల్లలకి పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయద్దు. వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలి. వ్యాధి సోకిన పిల్లలకు గోరువెచ్చని నీళ్లు తాగిస్తూనే ఉండాలి. డీహైడ్రేషన్ బారి నుంచి బయటపడేలా చేయాలి. బొబ్బలు, దద్దర్లు గోకడం వంటివి చేయకూడదు. గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి.
మొన్నటి వరకు కరోనా వైరస్ తో విలవిల్లాడింది కేరళ. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది అనుకుంటే మొన్నటికి మొన్న షింగెల్లా బ్యాక్టిరియా బయటపడి కంగారు పెంచింది. ఆ బ్యాక్టిరియా వల్ల ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది కూడా. ఇప్పుడు కొత్త వైరస్ ‘టమోటా ఫీవర్’ అలజడి రేపుతోంది.
Also Read: ఎంత ప్రయత్నిస్తున్నా పొట్ట తగ్గడం లేదా? దానికి ఈ అలవాట్లే కారణం