అధికరక్తపోటు ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు కారణమవుతోంది. కేవలం అధికరక్తపోటు వల్లే మరణిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డెరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ దేశంలో హైబీపీకి సంబంధించి కొత్త నివేదికను విడుదల చేశారు. అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ‘ఇండియా హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ రిపోర్టు’ పేరుతో విడుదలైన నివేదికలో అధికరక్తపోటుకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యతనివ్వాలని నివేదించింది. పరిస్థితి ప్రమాదకర స్థాయిలోనే ఉందని దేశంలో ఉన్న పెద్దవారిలో ప్రతి నలుగురిలో ఒకరికి హైబీపీ ఉన్నట్టు రిపోర్టు ద్వారా బయటపెట్టింది. 


ఇండియా హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ (IHCI) అనేది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియా బ్రాంచ్ కలిసి నిర్వహించిన ప్రాజెక్టు. 2017లో పెరిగిన రక్తపోటు కేసులను తగ్గించాలన్న లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. మొదటగా పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 26 జిల్లాల్లో సర్వేలను నిర్వహించారు. అక్టోబర్ 2021 నాటికి 19 రాష్ట్రాల్లోని 100కు పైగా జిల్లాల్లో ఈ ప్రాజెక్టును విస్తరించారు. 


 ఇండియాలోని పెద్దల్లో అధిక శాతం మందిలో హైబీపీ ఉన్నట్టు  పాత నివేదికలు ఎప్పుడో చెప్పాయి. నియంత్రణలో ఉంచుకునేట్టు చేయడం, హైబీపీ రోగుల సంఖ్య తగ్గేలా చైతన్యం పెంచేందకు ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో హైపర్ టెన్షన్ కేసుల్లో నాలుగు రెట్లు ఎక్కువ నియంత్రణ పెరిగినట్టు గుర్తించారు. హైబీపీ నియంత్రణంలో ఉంచుకుంటున్న రోగుల సంఖ్య పెరగుతున్నట్టు గుర్తించారు పరిశోధకులు. 


ఆందోళనకరమే...
గతంలో పోలిస్తే హైబీపీ నియంత్రణలో ఉంచుకుంటున్న వారి సంఖ్య పెరగుతున్నప్పటికీ... హైబీపీ బారిన పడిన రోగుల సంఖ్య అధికంగానే ఉన్నట్టు గుర్తించింది ఈ సర్వే. భారతదేశ జనాభాలో పెద్దవారిలో ప్రతి నలుగురిలో ఒకరు హైబీపీ రోగులుగా ఉన్నట్టు బయటపడింది. ఇది కాస్త ఆందోళన కలిగించే అంశమే. 


తీవ్రస్థాయిలో ఉంటే....
అధిక రక్తపోటు తీవ్ర స్థాయిలో పెరిగితే తలనొప్పి అధికంగా వస్తుంది. నిద్ర పట్టకపోవడం, చూపు మసకబారడం, విపరీతమైన అలసట, చెవ్వుల్లో శబ్ధాలు వినిపించడం, శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడడం, గుండెల్లో దడగా అనిపించడం, తికమకగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 


సాధారణ వ్యక్తిలో రక్తపోటు 120/80గా ఉంటుంది. అదే హైపర్ టెన్షన్ బారిన పడిన వారిలో ఆ రీడింగ్ 130/90 కన్నా అధికంగా ఉంటుంది.  


Also read: పిల్లల్లో పెరుగుతున్న ‘టమోటా ఫీవర్’, కేరళలో బయటపడ్డ కొత్త వైరస్, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే


Also Read: ఎంత ప్రయత్నిస్తున్నా పొట్ట తగ్గడం లేదా? దానికి ఈ అలవాట్లే కారణం