మన శరీరంలో అంత్యంత సంక్లిష్టమైన అవయవం మెదడు. శరీరంలోని ప్రతి పనిని నియంత్రించేది మెదడే. కానీ, మనకు అదేదీ కనిపించదు. మన కాళ్లు, చేతులు, ఆలోచనలు అన్నీ దాని ఆదేశాలతోనే పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా మనం గుర్తించలేం. జ్ఞానానికి, జ్ఞాపకశక్తికి, వయసుకు తగినట్టు జీవించడం అన్నీ మెదడు పనితీరు మీదే ఆధారపడి ఉంటుంది. అయితే, మెదడు లోపల ఏం జరుగుతుంది? ఎలా నష్టం జరుగుతుందనేది కూడా మనం అంత ఈజీగా అంచనా వేయలేం. దానివల్ల మనలో చాలామంది మెదడును సేఫ్‌గా ఉంచుకొనే ప్రయత్నాలేవీ చేయరు.
మెదడు ఆరోగ్యంపై శ్రద్ధ పెడితే డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మన రోజువారి చర్యలు కొన్ని మనకు తెలియకుండానే మెదడు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ప్రస్తుతం మనం బ్రెయన్ ట్యూమర్ అవేర్నేస్ మంత్ లో ఉన్నాం. ఈ సందర్భంగా మెదడు, దానికి జరిగే నష్టాన్ని గురించి తెలుసుకుందాం.
కొన్ని చిన్నచిన్న అలవాట్లు మార్చుకోక పోతే జీవితంలో చాలా కష్టపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెయిలీ ఆక్టివిటీ తక్కువగా ఉంటే మెదడు క్రమంగా దాని సామర్థ్యాన్ని కోల్పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్కవుట్
రోజుకు కనీసం 30 నిమిషాల పాటు లైట్ టూ మోడరేట్ వర్కవుట్ తప్పనిసరిగా చెయ్యాలని అంటున్నారు. అది వాకింగ్ అయితే మరీ మంచిది. 15 నిమిషాల పాటు కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీతో తర్వాత మోడరేట్ గా నడవడం వల్ల మెదడు పనితీరు చురుకుగా ఉండడమే కాదు.. ఓవరాల్ హెల్త్ కూడా మెరుగ్గా ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. వ్యాయామం చేసిన ప్రతిసారీ కొత్తగా మెదడు కణాలు అభివృద్ధి చెందుతాయి. కనుక తప్పనిసరిగా యాక్టివిటీలో ఉండాలి అని తెలిపారు. చురుకుగా ఉండడం వల్ల హార్ట్ పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. రక్తప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది. మెదడుకు మరింత ఆక్సిజన్ అందుతుంది. ఈపరిణామాలు హార్మోన్ల విడుదలకు, మెదడు కణాల పెరుగుదల వృద్దికి తోడ్పడుతాయి. మెదడు ఆరోగ్యానికి వారానికి ఒకసారి ఎరోబిక్స్ ఇంకా స్ట్రెంత్ ట్రెయినింగ్ వ్యాయామాలు చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
స్వీట్లు, జంక్ వద్దు
అల్ట్రా ప్రాసెస్డ్ ఫూడ్, అధిక చక్కెర, కొవ్వు కలిగిన ఆహారం, మెదడు ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయట. కేకులు, బిస్కట్లు, ఫిజీ డ్రింక్స్ వంటి ఆహారాలు, ప్రీప్యాక్డ్ మీల్స్ వంటి వాటికి దూరంగా ఉండడం అవసరం. వీటిలో ఎక్కువగా ఉండే ఉప్పు వల్ల బీపీ పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో సైకలాజికల్ సమస్యలు పెంచుతుంది.
ఒంటరి తనం
ఎక్కువ కాలం పాటు ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఉండడం, దీర్ఘకాలిక ఒంటరి తనం మెదడు ఆరోగ్యం మీద చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒంటరితనం న్యూరల్ ప్లాస్టిసిటికి మంచిదికాదు. ఇతరులతో ఇంటరాక్షన్ లేకపోతే కొత్త స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఒంటరితనం ఆరోగ్యం మీద చాలా ప్రభావాన్నే చూపుతుందని నిపుణులు అంటున్నారు.
మల్టీ టాస్కింగ్
చాలా రకాల పనుల్లో తీరికలేకుండా ఉండడం వల్ల దేనిమీదా సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారని అనిపిస్తుందా? దీర్ఘకాలం పాటు మల్టీటాస్కింగ్ చేసే వారిలో ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, ఆందోళన వంటి మానసిక సమస్యలు కలుగుతాయని బురియానోవా అంటున్నారు. ఇవన్నీ కూడా మెదడు సామర్థ్యాన్ని తగ్గిస్తాయట. కనుక తొందరేమీ లేదు. కూల్ గా పనులు చక్కబెట్టుకోవాలని నిపుణుల సలహా.