Suvarnarekha River: బంగారం ఎక్కడైనా గనుల్లో లభిస్తుంది. మనదేశంలోనూ బంగారు గనులు ఉన్నాయి. అయితే మన దేశం ప్రత్యేకమైన నది ఉంది. అది బంగారు నది. ఈ నది తనలో ఎంతో బంగారాన్ని దాచుకుంది. ఎంతోమంది ప్రజలు ఆ నది నుండి బంగారాన్ని వెలికి తీసేందుకు రోజూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ నది పేరు స్వర్ణ రేఖ నది. అక్కడి ప్రజలు దీన్ని సువర్ణ రేఖ అని పిలుచుకుంటారు. బంగారాన్ని దాచుకొని పరవాళ్ళు పెడుతోంది కాబట్టే దానికి ఈ పేరు వచ్చింది. ఈ నది ఝార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తోంది. అయితే ఈ నదిలోకి బంగారం ఎలా చేరింది అనేది మాత్రం ఇప్పటికీ అంతుబట్టని రహస్యమే. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఆ రహస్యాన్ని చేధించే ప్రయత్నం చేశారు. కానీ కనిపెట్టలేకపోయారు. జార్ఖండ్‌లోని పిస్కా అనే గ్రామంలో ఈ నది పుట్టి... పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఇక్కడి ప్రజలు ఎంతోమంది జల్లెడలు పట్టుకొని ఆ నది ఒడ్డున బంగారు వేట సాగిస్తూనే ఉంటారు. నది ఒడ్డున దొరికే ఇసుకను, నదిలోని ఇసుకను సేకరించి మెల్లగా జల్లిస్తూ ఉంటారు. రాళ్లు రప్పలు అన్ని పోగా చివరన బంగారు రజనులాంటిది మిగులుతుంది. చాలా చిన్నచిన్న అణువుల రూపంలో ఇది ఉంటుంది. దాన్ని ప్రాసెస్ చేస్తే అసలైన బంగారం మిగులుతుంది. ఆ బంగారాన్ని వారు అమ్ముకొని జీవిస్తూ ఉంటారు.


బంగారం అనగానే అక్కడ బోలెడంత లభిస్తుంది అనుకోవద్దు, చాలా తక్కువ మొత్తంలోనే దొరుకుతుంది. అదే చాలనుకుని జీవించేస్తున్నారు అక్కడి స్థానికులు. సూర్యోదయం అవ్వగానే జల్లెడలు పట్టుకొని నదికి వస్తారు. ఆ నదిలో దిగి ఇసుకను వెలికి తీసి జల్లిస్తూ ఉంటారు. మధ్యాహ్నం దాకా ఇదే పని. తర్వాత రాంచీకి వెళ్లి బంగారం షాపుల్లో వాటిని అమ్ముకుంటారు. దీనిని వృత్తిగా మార్చుకుని జీవిస్తున్న కుటుంబాలు అక్కడ ఎన్నో ఉన్నాయి.


ఆ నదిలోకి బంగారం ఎలా చేరిందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా శీతాకాలంలోనే ఇక్కడ ఎక్కువగా బంగారం లభిస్తుంది. ఇది మూడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నప్పటికీ, ఝార్ఖండ్లోనే ఎక్కువ బంగారం దొరుకుతుంది. అది కూడా ఈ నది ప్రారంభమైన పిస్కా గ్రామంలోనే ఎక్కువగా లభిస్తుంది. దీన్నిబట్టి అక్కడే భూగర్భంలో బంగారు గనులు ఉన్నాయని అనుమానం కూడా ఉంది. కానీ తవ్వకాలు మాత్రం జరుపలేదు. జార్ఖండ్లో బొగ్గు గనులు, బంగారుగనులు ఎక్కువగానే ఉంటాయి.


ఎన్నో గంటలు కష్టపడి ఇసుకను చెల్లిస్తే ఒక గ్రాము బంగారం లభించడమే ఎక్కువ. ఒక గ్రాము బంగారానికి 4000 నుంచి 5000 రూపాయల దాకా ఇప్పుడు వస్తుంది. పిస్కా గ్రామంలోని కుటుంబాలు పేరుకే బంగారాన్ని వెలికితీస్తాయి, కానీ ఆ బంగారం అమ్మితే వచ్చేది 5000 రూపాయలలోపే. నెలకి కొంతమందికి ఐదు నుంచి ఏడు వేల రూపాయల సంపాదించగలుస్తున్నారు. అయినా కూడా బంగారం వేట మాత్రం ఆపడం లేదు. వాటి మీద ఆధారపడి ఇంకా జీవిస్తున్నారు. 



Also read: జ్ఞాపకశక్తిని పెంచే అద్భుత ఆయుర్వేద మూలిక ఇదే, పిల్లలకు తినిపిస్తే చదువులో దూసుకెళ్తారు