Ten Basic Principles of Happy Living : జీవితంలో సంతోషంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ, నిత్యం ఏదో ఒక సమస్య మనల్ని వేధిస్తుంటుంది. సమస్యలు లేని మనిషి జీవితం మాత్రం ఉండదనేది ఎంత సత్యమో.. సమస్యలు జీవితాంతం కూడా ఉండవనేది కూడా అంతే సత్యం. సమస్యలను ఎదుర్కొనేలా మనల్ని మనం మలుచుకోవాలి. కష్టాలను తరిమేసే శక్తిని మనలో నింపుకోవాలి. మార్పును స్వీకరించి అవకాశాలను సృష్టించుకోవాలి. మన శక్తి సామర్థ్యాలపై ముందుగా మనకొక క్లారిటీ ఉండాలి. తద్వారా ఏం చేయగలం, ఏం చేయలేమో అనేది స్ఫష్టత వస్తుంది. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి 10 మార్గాలు. వాటిని అనుసరిస్తే కష్టాల్లోనూ నవ్వుతూ బతికేయచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు.
1. జీవితంలోని అన్ని అంశాలు: సవాళ్లను స్వీకరించడానికి, సమస్యలను అధిగమించడానికి ఎప్పటికప్పుడు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటే సవాళ్లకు ఎదురు నిలబడే శక్తి వస్తుంది. అది వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధికి దోహదం చేస్తుంది.
2. అపజయాలే విజయానికి సోపానం: వైఫల్యం నుంచి నేర్చుకుంటూ పోతే విజయాలకు నిచ్చెనమెట్లుగా మారుతాయి. విజయాన్ని అందుకోవాలన్న కృషి, పట్టుదల అదనపు శక్తినిస్తుంది.
3. కృతజ్ఞతాభావం ఆనందాన్ని పెంపొందిస్తుంది: కృతజ్ఞతాభావంతో మెలగడం వల్ల సానుకూల మనస్తత్వాన్ని పెంపొందిస్తుంది. ఇది మన చుట్టూ ఉన్న వాతావరణాన్నిఆనందమయంగా మార్చి మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది.
4. మనసుతో ఆలోచించడం జీవన నాణ్యతను పెంచుతుంది: ఈ క్షణం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఎలా ఉండకూడదో తెలిసుండాలి. మనసుతో ఆలోచించే లక్షణాన్ని అలవాటు చేసుకోవడం వలన అంశాలపై మరింత స్పష్టత, ఆలోచించే దృష్టి కోణం మారి మొత్తం జీవిత సంతృప్తికి దోహదం చేస్తాయి.
5. వ్యక్తిగత బాధ్యత వృద్ధికి శక్తినిస్తుంది: తోటి వ్యక్తుల పరిస్థితులను అర్థం చేసుకుని మసలుకోవడం, అవసరమైనప్పుడు ఆ బాధ్యతలను మనమే స్వీకరించడం ద్వారా ఆ వ్యక్తుల జీవితాల్లో సానుకూల మార్పును సృష్టిస్తుంది. ఇది నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
6. నిరంతర అభ్యాసం చాలా ముఖ్యం: జీవితకాలం నేర్చుకునే విద్యార్థిగానే ఉండాలి. విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్న జిజ్ఞాస ప్రతి మనిషి వ్యక్తిగత వృద్ధిని ప్రోత్సహిస్తుంది. కొత్త కొత్త అవకాశాలకు, అనుభవాలకు దారి చూపిస్తుంది.
7. ప్రేమ అత్యంత బలమైన శక్తి: ప్రేమ ఈ ప్రపంచంలోనే బలమైన శక్తి. మనల్ని మనం ప్రేమించుకోవడం. తోటి వారిని ప్రేమించడం, ఔదార్యంతో ఉండటం లాంటివన్నీ జీవితంలో ఆనందాన్ని పంచుతాయి. నీ పట్ల ఇతరులకు సదాభిప్రాయాన్ని కలగజేస్తాయి.
8. స్వీయ-అవగాహన వ్యక్తిగత అభివృద్ధికి దారితీస్తుంది: మన బలాలు, బలహీనతలపై మనకు స్పష్టత ఉండాలి. మన కోరికలను నియంత్రణ చేసుకునే సామర్థ్యం పంచుకోవాలి. తనను తాను అర్థం చేసుకోగలిగినవాడు సమస్యలను అధిగమించడంలో ముందుంటాడు.
9. మార్పును స్వీకరించడం వృద్ధికి అవసరం: మార్పు అనివార్యం. దానిని అంగీకరించక తప్పదు. ఇది వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడటంతోపాటు అవకాశాలను కల్పిస్తుంది.
10. సమాజం పట్ల దయ, సానుభూతి కలిగి ఉండాలి: ఇతరుల పట్ల కనికరం చూపడం, వారి సమస్యల పట్ల అవగాహనతో వ్యవహరించడం మానవ సంబంధాలను మెరుగుపరచడమే కాకుండా మరింత సామరస్యపూర్వకమైన ప్రపంచ నిర్మాణానికి దోహదం చేస్తుంది.
Also Read : హస్తప్రయోగం ఎక్కువగా చేస్తే ఆ సమస్యలు తప్పవట.. అపోహలు, వాస్తవాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే