పీడకలలు కొందరికి తరచూ వస్తూ ఉంటాయి. అలాంటి వారు నిద్రపోవడానికే చాలా భయపడిపోతూ ఉంటారు. రాత్రి పూట రోజూ పీడకలలు రావడం అనేది సాధారణ విషయం కాదు. అది అంతర్లీన ఆరోగ్య సమస్యలకు చిహ్నం కూడా కావచ్చు. ముఖ్యంగా ఎవరికైతే పీడకలలు అధికంగా వస్తాయో వారు వయసు ముదురుతున్న కొద్దీ వారు మతిమరుపు బారిన త్వరగా పడతారు. అంతే కాదు చిన్న వయసులోనే చాలా విషయాలు మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి పీడకలలు వస్తున్న వారు, మతిమరుపు సమస్యలు ఉన్నాయేమో ఓసారి చెక్ చేసుకోండి.
విషయాలు మర్చిపోవడాన్ని డిమెన్షియా అంటారు. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హామ్ పరిశోధకులు పీడకలల వల్ల కలిగే అనర్ధాలు గురించి అధ్యయనం చేశారు. పీడకలల వల్ల విషయ గ్రహణ సామర్థ్యం తగ్గిపోతుందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా ముప్పై అయిదేళ్ల నుంచి అరవై నాలుగేళ్ల వయసు మధ్య వారిని ఎంచుకున్నారు. దాదాపు 2,600 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. సాధారణ మనుషులతో పోలిస్తే పీడకలలు వచ్చే వారు త్వరగా మతిమరుపు బారిన పడతారు.
సాధారణ మనుషులతో పోలిస్తే పీడకలలు వచ్చే వారు డిమెన్షియ బారిన పడే అవకాశం నాలుగు రెట్లు అధికమని అంటున్నారు అధ్యయనకర్తలు. పీడకలలు వచ్చేవారు ఆ విషయాన్ని తేలికగా తీసుకోకూడదు. వెంటనే మానసిక వైద్యులను సంప్రదించాల్సి అవసరం ఉంది. కలలు అందరికీ వస్తాయి, కానీ పీడకలలు మాత్రం అందరికీ రావు. సాధారణ కలల వల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ పీడకలలు వల్ల మాత్రం చాలా ప్రమాదం.
కొన్ని రకాల నిద్రా రుగ్మతల వల్ల కూడా పీడకలలు వచ్చే అవకాశం ఉంది. స్లీప్ ఆప్నియా, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్, నార్కోలెప్సీ వంటి నిద్రా సమస్యలు వల్ల పీడకలలు అధికంగా రావచ్చు. స్లీప్ అప్నియా వంటి సమస్యలు వచ్చినప్పుడు నిద్రలో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అప్పుడు పీడకలలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. అయితే పీడకలలకు, డిమెన్షియా మధ్య సంబంధాన్ని తేల్చడానికి మరింత లోతైన అధ్యయనాలు అవసరం పడతాయి. ఈ పీడకలలు ఆడవారి కన్నా మగవారిలోనే వచ్చే అవకాశం ఉంది. వీరికే డిమెన్షియా వచ్చే అవకాశం పెరుగుతుంది. యాంటీ డిప్రెసెంట్లు వాడే వారిలో కూడా పీడకలలు వచ్చే ప్రమాదం అధికంగానే ఉంటుంది. ట్రామా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి జబ్బుల బారిన పడినా కూడా పీడకలలు అధికంగా వస్తాయి.
Also read: మద్యం తాగితే మగాళ్ళ కన్నా మహిళలకే ఎక్కువ ప్రమాదమా?
Also read: ఆ సమయంలో దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.