నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్న మొట్ట మొదటి తెలుగు యాక్టర్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. 'పుష్ప-ది రైజ్' సినిమాలో తన అసాధారణమైన నటనకు గాను 'బెస్ట్ యాక్టర్' విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.


రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్న ఫోటోని అల్లు అర్జున్ ట్విట్టర్ X లో పంచుకున్నారు. ''జాతీయ అవార్డును అందుకోవడం విశేషంగా భావిస్తున్నాను. నాకు ఈ గుర్తింపు ఇచ్చిన జ్యూరీకి, మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ అవార్డు నా వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు, మన సినిమాను ఆదరించిన వారందరికీ చెందుతుంది. డైరెక్టర్ సుకుమార్ గారికి ధన్యవాదాలు. నా విజయానికి మీరే కారణం.'' అని బన్నీ పేర్కొన్నారు. అలానే 'అరుదైన అందమైన క్షణం' అంటూ జాతీయ అవార్డు గ్రహీతలందరూ దిగిన మరో ఫోటోని షేర్ చేశారు.






కాగా, న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌ వేదికగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం అట్టహాసంగా జరిగింది. 2021 సంవత్సరానికి గాను ఆగస్టులో ప్రకటించిన విజేతలకు పురస్కారాలు అందించారు. 'పుష్ప-1' చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డ్ స్వీకరించారు. ఈ ఘనత సాధించిన ఫస్ట్ తెలుగు యాక్టర్ గా హిస్టరీ క్రియేట్ చేసారు. ఈ కార్యక్రమానికి బన్నీ తన సతీమణి అల్లు స్నేహా రెడ్డితో కలిసి హాజరయ్యారు.










నేషనల్ ఫిలిం అవార్డ్స్ వేడుక ప్రారంభానికి కొన్ని క్షణాల ముందు అల్లు అర్జున్ మీడియాతో మట్లాడుతూ, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారం అందుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. 'పుష్ప: ది రైజ్‌' లాంటి కమర్షియల్‌ చిత్రానికి జాతీయ అవార్డు రావడమనేది డబుల్‌ అఛీవ్‌మెంట్‌ అని పేర్కొన్నారు. అనంతరం 'తగ్గేదేలే' డైలాగ్‌ చెప్పి అలరించారు. దీనికి సంబంధిత వీడియోను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.


'పుష్ప' చిత్రంలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ప్రేక్షకులని అలరించారు. అతని యాక్షన్-ప్యాక్డ్ షోకి దేశవ్యాప్తంగా సినీ అభిమానులు మంత్రముగ్ధులయ్యారు. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న 'పుష్ప: ది రూల్' మూవీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో మొదటి భాగాన్ని మించి ఉండేలా పార్ట్ 2 ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించనున్నారు. 2024 ఆగస్టులో ఈ పాన్ ఇండియా చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ నటించనున్నారు.


Also Read: అల్లువారి ఇంట వరుణ్‌ తేజ్ - లావణ్య ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌.. ఫొటోలు వైర‌ల్! 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial