మద్యపానం చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. అలాగే లింగ భేదం కూడా తగ్గిపోతుంది. మహిళల్లో కూడా మద్యపానం చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఆల్కహాల్ మగవారి శరీరంలో ఒకలా, ఆడవారి శరీరంలో ఒకలా భిన్నంగా స్పందిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఆల్కహాల్ ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నాయి అధ్యయనాలు. ఆల్కహాల్ తాగిన తర్వాత అది రక్తప్రవాహంలోకి ప్రవేశించడానికి ముందు డిహైడ్రోజినేస్ అనే ఎంజైమ్... దాన్ని జీవక్రియకు గురిచేస్తుంది. అయితే ఈ ఎంజైమ్ పురుషులతో పోలిస్తే మహిళల్లో చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చేరిన ఆల్కహాల్ ఎక్కువ కాలం పాటు రక్తంలోనే ఉండిపోతుంది. దీనివల్ల మహిళల్లో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత, హై బీపీ, కొన్ని రకాల క్యాన్సర్లు, కాలేయ సమస్యలు వంటివి త్వరగా రావచ్చు.


ఆల్కహాల్ తాగిన తర్వాత పురుషుల రక్తంలో చేరిన మద్యం త్వరగానే బయటికి పోతుంది. కానీ ఆడవారి రక్తంలో మాత్రం ఎక్కువ కాలం ఉండడం వల్ల ఆ ప్రభావం కాలేయంపై తీవ్రంగా పడుతుంది. అలాగే వీరి పునరుత్పత్తి సామర్ధ్యాన్ని కూడా ఆల్కహాల్ ప్రభావితం చేస్తుంది. ఈస్ట్రోజన్‌ను పెంచి ప్రొజెస్టరాన్ హార్మోన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత  ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే వారిలో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం అధికం. హార్మోన్లు అసమతుల్యత కారణంగా కొవ్వు అధికంగా పేరుకు పోతుంది. దీనివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.


ఆల్కహాల్ తాగే వారి సంఖ్య పెరుగుతోంది. విదేశీ సంస్కృతి ప్రభావం మన యువతపై అధికంగా పుడుతుంది. విదేశాల్లో ఆల్కహాల్ తాగడం అనేది చాలా సాధారణ విషయం. యువతులు ఆల్కహాల్‌ను అధికంగా తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం కూడా చెడిపోతుంది. దీనివల్ల తక్కువ వయసులోనే ఆస్టియోపొరాసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అధిక ఆల్కహాల్‌కు, క్యాన్సర్ కు మధ్య సంబంధం ఉన్నట్టు ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. శరీరంలో క్యాన్సర్ కణజాలాలను పెంచేందుకు ఆల్కహాల్ సహకరిస్తుంది. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. కాబట్టి ఆల్కహాల్‌ను మహిళలు దూరంగా పెట్టాలి. మరీ తాగాలనిపిస్తే నెలకి ఒకటి రెండుసార్లతో సరిపెట్టుకోవాలి. అధికంగా తాగడం, అది కూడా ప్రతిరోజు తాగడం వల్ల వారి ఆరోగ్యం చాలా తక్కువ కాలంలోనే క్షీణిస్తుంది. 


Also read: ఆ సమయంలో దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి









గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.