బరువు తగ్గడానికి చాలా పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. అవి తినకూడదు, ఇవి తినాలి అనుకుంటారు. కొద్ది రోజులు బాగానే ఫాలో అవుతారు. కానీ కంటికి నచ్చినది కనిపించిందంటే డైట్ చార్ట్ గోవిందా..! అందుకే దృష్టి వాటి మీదకి వెళ్ళకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కూరగాయల విషయానికి వస్తే వాటిలో స్వీట్ పొటాటో ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గేందుకు అన్ని విధాలుగా సహాయపడుతుంది. స్వీట్ పొటాటో దీన్ని కొందరు చిలగడదుంప అని కూడా పిలుస్తారు. వాటిని ఉడికించుకుని కొద్దిగా నూనె వేసి అందులో కాస్త నిమ్మరసం, మసాలా వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం వేళ స్నాక్స్ గా తినేందుకు ఇది చక్కటి ఎంపిక. అటు మసాలా వల్ల స్పైసినెస్ అలాగే రుచికరమైన ఆరోగ్యకరమైన ఫుడ్ తిన్నట్టే.
వాస్తవానికి ఈ స్వీట్ పొటాటో(చిలకడ దుంప) బరువు తగ్గించేందుకు సూపర్ ఫుడ్. షాకర్ కండ్, సక్కరవల్లి కిజాంగు (తమిళం), తెలుగులో చిలగడదుంప అని పిలుస్తారు. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్స్, విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లుతో నిండి ఉంటుంది. 100 గ్రాముల స్వీట్ పొటాటోలో 70 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇందులో 28 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.6 గ్రాముల ప్రోటీన్స్, 120 కేలరీలని అందిస్తుంది. తొక్క తియ్యకుండా ఉడికించి తిన్నప్పుడు ప్రతి 100 గ్రాములకి 4 గ్రాముల ఫైబర్ అందుతుంది.
మధుమేహం అదుపులో
మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనికి దూరంగా దుంపలు ఎక్కువగా తీసుకోకూడదనే అపోహ ఉంటుంది. కానీ ఈ స్వీట్ పొటాటో వేరు కూరగాయ అయినప్పటికీ ఉడకబెట్టి తొక్కతో తింటే మధుమేహులకి చాలా లాభం. ఆకలిని తగ్గిస్తుంది. ఉడికించిన చిలగడదుంప గ్లైసెమిక్ ఇండెక్స్ 60 గా ఉంది. అంటే ఇది మితమైన ఆహారమే, దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అడుపులోనే ఉంటాయి. ఇందులో అధిక ఫైబర్ ఉన్నప్పటికీ చిరుతిండిగా తీసుకోవడానికి చక్కని ఎంపిక. సాధారణ బంగాళాదుంపకి బదులుగా దీన్ని ఉపయోగించవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల మితంగా తీసుకోవాలి. వైద్యుని సలహా ప్రకారం తీసుకోవడం మరీ ముఖ్యమైన విషయం.
బరువు తగ్గించేందుకు
వ్యాయామ సమయంలో గ్లైకోజెన్ స్థాయిలు తగ్గిపోతాయి. వాటిని తిరిగి నింపేందుకు చిలగడదుంప తీసుకోవడం వల్ల చాలా మేలు చేస్తుంది. వర్కౌట్ తర్వాత గుడ్లు, పనీర్, లేదా పప్పు మాదిరిగానే వీటిని తీసుకోవచ్చు. మంచి పోషకాహారం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. వీటిలో విటమిన్ బి5, విటమిన్ బి 6 ఉంటాయి. బరువు నిర్వహణలో కీలకమైన జీవక్రియని నిర్వహించడంలో సహాయపడతాయి.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. పెద్ద పేగు, మూత్రాశయం, పొట్ట, రోమం సహాయ కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని నివారించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ప్రొస్టేట్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయని నిపుణులు వెల్లడించారు. యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, డయేరియా, మలబద్ధకం వంటి వాటికి ఇవి గొప్ప సహజ నివారణగా పని చేస్తుంది.
గుండెకి మేలు
గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెకి మేలు చేయడంతో పాటు రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఛాతిలో మంటగా ఉంటుందా? అది GERD లక్షణమే!