డయాబెటిక్ రోగులు అన్ని రకాల ఆహారాలను తినకూడదు. వారి ఆరోగ్యానికి హాని చేయని ఆహారాలనే ఎంపిక చేసుకుని తినాలి. అలాగే కొన్ని రకాల పదార్థాలు వారికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో ఒకటి కాకరకాయ. దీంతో తీపి కాకర పచ్చడి చేసుకుని నిల్వ చేసుకుంటే అప్పుడప్పుడు తినవచ్చు. నోరు బాగోలేనప్పుడు, చేదుగా అనిపించినప్పుడు ఈ చట్నీని తింటే మంచిది. దీనిలో బెల్లం ఉన్నప్పటికీ అది అంత ప్రమాదకారి కాదు. పచ్చడి తినేటప్పుడు ఒకేసారి అధిక మొత్తంలో తినకుండా ఉంటే చాలు, బెల్లం ఒకేసారి ఒంట్లో చేరదు. దీని తయారు చేయడం చాలా సులువు. ఒకసారి తయారుచేసుకుంటే నెల రోజుల పాటూ నిల్వ ఉంచుకోవచ్చు. 


కావాల్సిన పదార్థాలు
కాకరకాయలు: పావు కిలో 
బెల్లం - వంద గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర స్పూను
కారం - మూడు స్పూనులు
నూనె - తగినంత
ఉల్లి పాయలు - మూడు


తయారు చేసే విధానం
కాకరకాయల్ని గుండ్రంగా, చక్రాల్లా కోసుకోవాలి. లేదా పొడవుగా కోసుకున్నా ఫర్వలేదు. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవడం మంచిది.ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కోసిన కాకర కాయ ముక్కల్ని వేయించాలి. ఈలోపు ఉల్లిపాయల్ని ముక్కలుగా కోసి మెత్తగా రుబ్చేయాలి. కాకరకాయ ముక్కల్ని బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.  ఆ నూనెలోనే ఉల్లి ముద్దని బాగా వేయించాలి. అందులో బెల్లం తురుము, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేయించాలి. అవి వేగాక కాకర ముక్కల్ని వేసి కలపాలి. బాగా వేగాక స్టవ్ కట్టేయాలి. దీని రుచి కారంగా, తీపిగా ఉంటుంది. డయాబెటిక్ రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.  


కాకరకాయలో అధికంగా నీటి శాతం ఉంటుంది. ఇది బరువు తగ్గేవారికి మంచి ఎంపిక. డయాబెటిస్ ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన కూరగాయల్లో ఒకటి కాకరకాయ. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తంలోని చక్కెరను శక్తిగా మార్చేందుకు సహాయపడతాయి. ప్రతిరోజు కాకరకాయ తినేవారికి మధుమేహం అదుపులో ఉంటుంది. కాకరకాయను పొడి, కూర, పచ్చడి... ఏ రూపంలో తిన్నా మంచిదే. వీటిని తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.  అప్పుడప్పుడు కాకర కాయ టీ చేసుకుని తాగినా ఎంతో మంచిది. నీటిలో కాకరకాయ ముక్కలు వేసి బాగా మరిగించి ఆ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా రోజూ తాగితే ఎంతో మంచిది.



Also read: మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? అలా మాట్లాడడానికి కారణం ఏమిటో, దానికి చికిత్సేమిటో తెలుసా?



Also read: పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడానికి ఒత్తిడి హార్మోన్ కూడా ఒక కారణమే

























































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.