Saalar Teaser Date : దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న'సలార్' గురించి ఓ బిగ్ అప్‌డేట్ అధికారికంగా వెలువడింది. మరి కొద్ది రోజుల్లోనే టీజర్ విడుదల కానుందంటూ మేకర్స్ చేసిన ఈ కొత్త అనౌన్స్ మెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను హుషారెక్కిస్తోంది. ఈ సందర్భంగా ప్రభాస్ యాక్షన్-ప్యాక్డ్ కొత్త పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దాంతో పాటు ఈ మూవీ టీజర్ జూలై 6న ఉదయం 5:12 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రభాస్, కృతి సనన్ నటించిన 'ఆదిపురుష్' ఇటీవలే విడుదలై.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'సలార్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ప్రభాస్ కొత్త అవతార్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక పవర్‌పుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ కథాంశంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ మూవీని తెరకెక్కిస్తోన్నాడు. 'కేజీఎఫ్ -2' బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సలార్' సినిమాపై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది.
హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'సలార్' చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో చిత్రీకరణ సజావుగా సాగలేదు. అయినప్పటికీ చిత్ర యూనిట్ ఇటీవలే దీనికి సంబంధించిన టాకీ పార్టు మొత్తాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసినట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్' మూవీని సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. దీనికి సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై ఫోకస్ చేసింది. అందులో భాగంగానే ఈ మూవీ నుంచి టీజర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దీన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన లేదా జూలై 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఈ మధ్య కాలంలో టాక్ కూడా వినిపించింది.
తెలుగు, తమిళం, హిందీతో పాటు వివిధ భారతీయ భాషల్లో సెప్టెంబర్ 28న 'సలార్' రిలీజ్ కానుంది. సలార్ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తుండగా.. శృతిహాసన్, జగపతిబాబు పలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో విజయ్ కిరగందూర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు వంద రోజులే సమయం ఉండటంతో టీజర్ రిలీజ్ నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial