శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ యాక్షన్ మూవీ ‘మావీరన్’. తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాతలు రిలీజ్ చేశారు. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా తెలుగు, తమిళ భాషల్లో జులై 14వ తేదీన విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. గతంలో ‘మండేలా’ అనే సందేశాత్మక సినిమా తీసిన మడోన్ అశ్విన్ ‘మహావీరుడు’కి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో ఏషియన్ సునీల్ ఈ సినిమాను పంపిణీ చేస్తున్నారు.


‘మహావీరుడు’ ట్రైలర్ ఎలా ఉంది?
గొడవలంటే భయపడే పిరికివాడిగా శివకార్తికేయన్‌ను చూపించడంతో కథ మొదలవుతుంది. అదితి శంకర్‌తో లవ్ ట్రాక్‌ను కూడా కొంచెం లైట్‌గా చూపించారు. కార్టూనిస్టు పాత్రలో శివ కార్తికేయన్ కనిపించారు. ‘మహావీరుడు’ అనే కల్పిత పాత్రను శివకార్తికేయన్ సృష్టిస్తాడు. తన రూపాన్నే ఆ పాత్రకు ఇచ్చినట్లు ట్రైలర్‌లో చూపించారు. అయితే శివకార్తికేయన్ ప్రమాదంలో ఉన్నప్పుడు పైకి చూస్తే ఆ పుస్తకంలోని పాత్ర నిజంగా తన శరీరంలోకి వచ్చి పోరాడుతుంది. దాని చుట్టూ కామెడీని కూడా జనరేట్ చేశారు. విలన్ పాత్రలో మిస్కిన్, తన పక్కన అసిస్టెంట్ పాత్రలో సునీల్ కనిపించారు. హీరో తల్లి పాత్రలో అలనాటి హీరోయిన్ సరిత కనిపించారు.


ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి:



'మహావీరుడు' చిత్రాన్ని 2023 ఆగస్ట్ 11న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు గతంలో ప్రకటించారు. అయితే తర్వాత దాన్ని నాలుగు వారాల ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. నిజానికి శివ కార్తికేయన్ సినిమాని ప్రీపోన్ లేదా పోస్ట్ పోన్ చేస్తారని అభిమానులు, సినిమా వర్గాలు ముందుగానే ఊహించారు. దీనికి కారణం ఆగస్టు 10వ తేదీన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ వస్తుండటమే. 


నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'జైలర్' చిత్రాన్ని ఆగస్టు 10న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు గతంలోనే అధికారికంగా వెల్లడించారు. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'భోళా శంకర్' మూవీ కూడా రాబోతోంది. తెలుగులో ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించనుంది. ఇవన్నీ ఆలోచించుకుని బాక్సాఫీస్ వద్ద పోటీని నివారించడానికి 'మహావీరుడు' సినిమాని ఒక నెల ముందుకు ప్రీపోన్ చేసారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండటంతో జూలై 14వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.


ఇందులో సునీల్, మిస్కిన్, యోగిబాబు, సరిత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భరత్ శంకర్ సంగీత దర్శకుడిగా ఉన్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, కుమార్ గంగప్పన్ ఆర్ట్ డైరెక్టర్‌గా ‘మహావీరుడు’ కోసం పని చేస్తున్నారు. శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ విశ్వ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.