వేసవిలో ఉక్కపోత సర్వ సాధారణమే. అయితే, ఏసీలో కూడా కొందరికి చెమటలు పట్టేస్తుంటాయి. చల్లని వాతావరణంలో నిద్రపోతున్నా.. చెమట చికాకు పెడుతుంటుంది. అయితే, దీన్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు. రాత్రివేళ నిద్రలో పట్టే చెమట కొన్ని రకాల అనారోగ్యాలకు సంకేతాలు. మరి, అవేంటో చూసేద్దామా. 
 
కరోనా వైరస్ కావచ్చు: నిద్ర వేళలలో చెమట పట్టడం ఒమిక్రాన్ కరోనా వైరస్ లక్షణమని వైద్యులు తెలిపారు. ఈ సమస్య ఉన్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. లేదా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇలా నిద్రలో చెమటపట్టే సమస్య ఉన్నవారు గాలి తగిలేలా ఇంటి కిటికీలు తెరిచి ఉంచుకోవాలి. వదులైన దుస్తులు ధరించడమే కాకుండా మంచం వద్ద ఒక గ్లాస్ నీళ్లను పెట్టుకోవడం మంచిది.  


చక్కెర స్థాయిలు తగ్గినప్పుడు: మధుమేహంతో బాధపడేవారిలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినప్పుడు చెమటలు ఎక్కువగా పడతాయి. దీన్నే ‘హైపోగ్లైసీమియా’ అని కూడా అంటారు. శరీరంలో  ఇన్సులిన్ స్థాయిలు తగ్గినప్పుడు కూడా ఈ సమస్య కనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా పడిపోయినప్పుడు, ఆడ్రినలిన్ విడుదల అవుతుంది. అది చెమట గ్రంథులు ప్రేరేపిస్తుంది. శరీరాన్ని చల్లబరిచేందుకు చెమటను విడుదల చేస్తుంది. 


అంటువ్యాధులు: రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్‌తో పోరాడే సమయంలో కూడా చెమటలు పడతాయి. కరోనా వైరస్‌ బాధితుల్లో చాలామంది ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే టీకా ప్రభావం వల్ల కూడా కొందరికి నిద్రలో చెమటలు పట్టాయట. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ లేదా పరాన్నజీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌ల వల్ల మీకు నిద్రలో చెమటలు పట్టవచ్చు. 


ఆందోళన: ఏదైనా ఆందోళన, టెన్షన్‌తో బాధపడేవారిలో కూడా చెమట ఎక్కువగా పడుతుంది. ఆందోళనతో బాధపడే చాలామందికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఫలితంగా శరీరాన్ని చల్లబరిచేందుకు చెమట పడుతుంది. 


మద్యపానం: రాత్రివేళలలో మద్యం తాగి నిద్రపోయేవారిలో కూడా ఈ సమస్య ఏర్పుడుతుంది. ఎందుకంటే మద్యం మీ వాయుమార్గాలపై ప్రభావం చూపుతుంది. శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. ఫలితంగా ఊపిరి పీల్చుకోడానికి శరీరం ఎక్కువ శ్రమిస్తుంది. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆల్కహాల్ వల్ల  హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది. ఫలితంగా చెమట పడుతుంది.  


క్యాన్సర్ వల్ల కూడా..: రాత్రిపూట చెమటలు పట్టడమనేది కొన్ని క్యాన్సర్‌లకు ముందస్తు హెచ్చరిక. ముఖ్యంగా లింఫోమా అనే రక్త క్యాన్సర్‌‌కు ఇది సూచన.  కాబట్టి, నిద్రలో చెమటపడుతున్నట్లయితే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి. 


మెనోపాజ్: మహిళలకు రాత్రిపూట నిద్రలో చెమటలు పడుతున్నట్లయితే.. అది తప్పకుండా మెనోపాజ్ సమస్య కావచ్చు.  మెనోపాజ్ సమయంలో హార్మోన్ మార్పులు జరుగుతాయి. దాని వల్ల విపరీతంగా చెమట పడుతుంది. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు. మానసిక ఆందోళనను దూరం చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.


Also Read: ఏంటమ్మా ఏంటీ? సింధూరం పెట్టుకుంటే శృంగార కోరికలు పుడుతాయా?


మందుల వల్ల: కొన్ని రకాల ఔషదాలు కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. యాంటిడిప్రెసెంట్స్, స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్లు శరీరానికి వేడి కలిగిస్తాయి. దాని వల్ల చెమటలు పట్టే అవకాశాలున్నాయి. ఈ సమస్య ఉన్నట్లయితే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 


Also Read: చాక్లెట్లు తింటే చిన్న వయస్సులోనే చనిపోతారా? తాజా అధ్యయనంలో ఏం తేలింది?


గమనిక: వివిధ్య అధ్యయనాలు, వైద్య నిపుణులు తెలిపిన వివరాలను మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఆరోగ్యంపై ఎలాంటి సందేహాలు ఉన్నా డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమ మార్గం. ఈ కథనంలోని అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీనీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు.