నాన్నగారంటే మీకు ఎంత ఇష్టం? మీకు ఎంతో ఇష్టమైన నాన్నను ఎప్పుడైనా ఆరోగ్యం ఎలా ఉందని అడిగారా? ఒక వేళ మీరు ఆ మాట అడిగినా.. వారు చెప్పే సమాధానం ఏమిటో తెలుసా? ‘‘అంతా బాగానే ఉంది. వయస్సు పెరిగే కొద్ది ఇలాంటి సమస్యలు సాధారణమే’’ అని చాలా తేలిగ్గా మీకు ఆన్సర్ ఇస్తారు. కానీ, ఆ చిన్న చిన్న సమస్యలే పెద్దవై కూర్చుంటాయి. కానీ, వాటిని అనుభవించేవారికి మాత్రం అవి చాలా సహజం అనిపిస్తుంది. కొందరైతే తమని తాము చాలా స్ట్రాంగ్ అని అనుకుంటారు. అలా తమని తాము.. ఆరోగ్యంగా ఉన్నామని మోసం చేసుకుంటూ, బలమైన వ్యక్తులుగా భావించడాన్నే ‘సూపర్ మ్యాన్ సిండ్రోమ్’ అంటారు. ఈ సిండ్రోమ్ వల్ల పొట్ట పెరిగినా, జుట్టు రాలినా, ఛాతి భాగం పెరుగుతున్నా.. పట్టించుకోరు. 19న ఫాదర్స్ డే.. కాబట్టి, ముందుగానే ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఈ కింది సమస్యలు మీ తండ్రిలో కనిపిస్తుంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి.
పురుషుల్లో మూడొంతుల మంది హాస్పిటల్‌కు వెళ్లేందుకు ఇష్టపడరు. డాక్టర్ అంటే భయం వల్ల కాదు. తమని తాము స్ట్రాంగ్‌గా భావించే ‘సూపర్ మ్యాన్ సిండ్రోమ్’ ఉండటం వల్లే. ఇటీవల ఓ వ్యక్తికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. అయితే, అది అజీర్తి లేదా గ్యాస్ వల్ల వచ్చిందని భావించాడు. తనకు ఏ చెడు అలవాట్లు లేవని, తనకు ఎందుకు అనారోగ్యం వస్తుందని ఇంట్లోవారితో వాదించాడు. కానీ, ఇంట్లోవారు అతడిని బలవంతంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు అతడికి వైద్య పరీక్షలు చేయగా.. అది గుండెనొప్పని తేలింది. సమయానికి హాస్పిటల్‌కు తీసుకుని రాకపోయి ఉంటే.. అతడు ఏ క్షణంలోనైనా ప్రాణాలు కోల్పోయేవాడని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులే కాదు, బాధితుడు కూడా ఆశ్చర్యపోయాడు. కాబట్టి, ఈ కింది లక్షణాలు కనిపిస్తే.. వారికి ఏదో ఒక రోజు ప్రమాదం ఉంటుందని భావించండి. మీ తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించండి.
పురుషులకు వక్షోజాలు: వయసుతోపాటే పొట్ట పెరుగుతుంది. అంతా తమకు పొట్ట వచ్చేస్తుందని ఫీలవుతారేగానీ, మహిళల తరహాలో పెరిగే వక్షోజాలు (ఛాతి భాగం) గురించి పట్టించుకోరు. సరైన వ్యాయామం లేకపోవడం, అతిగా మందు కొట్టడం వంటి కారణాల వల్ల అలాంటి సమస్య వస్తుంది. వైద్యుల లెక్క ప్రకారం.. రోజూ 14 యూనిట్ల(ఆరు పింట్లు) కంటే ఎక్కువ ఆల్కహాల్ తాగకూడదు. పురుషులకు రొమ్ములు పెరగకుండా ఉండాలంటే టెస్టోస్టెరాన్ అవసరం. ఆల్కహాల్ కాలేయంలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా పురుషులు పెరుగుతాయి. కాలేయ వ్యాధి, మూత్రపిండాల సమస్యలు కూడా ఇందుకు కారణం కావచ్చు. ఒక వేళ మీ తండ్రి మద్యపానం అలవాటు లేకున్నా.. ఈ సమస్య వస్తుంటే తప్పకుండా అప్రమత్తం కావాలి.
జుట్టు రాలుతోందా?: మీ తల్లిదండ్రులు అకస్మాత్తుగా జుట్టు రాలుతున్న సమస్యతో బాధపడుతుంటే తేలిగ్గా తీసుకోవద్దు. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్య ఎక్కువ. అయితే, అది సర్వసాధారణంగా అనిపించవచ్చు. కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఒత్తిడి వంటి ఇతర కారణాలు కూడా అందుకు కారణం కావచ్చు. ఒత్తిడి ఎలాంటి ఎన్నో అనారోగ్యాలకు దారి తీస్తుంది. కాబట్టి, అప్రమత్తంగా ఉండండి.
నిరంతర దగ్గు: కోవిడ్-19 తర్వాత దగ్గు రావడం సర్వసాధారణమైంది. ఆ దగ్గు వల్ల ఎన్నో భయాలు నెలకొన్నాయి. అయితే, మీ తండ్రి లేదా మరెవరైనా ఆగకుండా దగ్గుతున్నా, ఎన్ని మందులేసినా తగ్గకపోయినా ఊపిరితీత్తుల సమస్యగా గుర్తించాలి. ఒక్కోసారి తీవ్రమైన దగ్గు.. ఊపిరితీత్తుల క్యాన్సర్‌కు దారితీయొచ్చు.
చిగుళ్ళలో రక్తస్రావం: పురుషులు చిగుళ్ల వ్యాధి సమస్యలను కూడా తేలిగ్గా తీసుకుంటారు. దీని వల్ల చిగుళ్లు ఎర్రగా మారడం, వాపు, పుండ్లు ఏర్పడటమే కాకుండా, ఒక్కోసారి వాటి నుంచి రక్తస్రావం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపించినా.. చాలామంది వాటికవే తగ్గిపోతాయిలే అని పట్టించుకోరు. ఇలాంటి సమస్య కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వెంటనే చికిత్స చేయకపోతే.. అది చిగుళ్ల వ్యాధి, అనేది తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. మృదు కణజాలానికి హాని కలుగుతుంది. దంతాలు కూడా పాడవుతాయి. ఇది డయాబెటిస్, గుండె జబ్బులు, స్క్రోక్ వంటి సమస్యలకు దారి తీయొచ్చు.
పొట్ట పెరిగితే..: మీ తండ్రి స్లిమ్‌గా ఉన్న పొట్ట పెరుగుతుంటే జాగ్రత్తపడండి. ఎందుకంటే.. దానివల్ల గుండె జబ్బుల ప్రమాదం ఉంది. నడుము చుట్టుకొలత పెరిగినా ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదాహరణకు మీ తండ్రి 5 అడుగుల 11 పొడవుంటే.. నడుము 90 సెంటీమీటర్లు కంటే తక్కువ ఉండాలి. మీ తండ్రికి లేదా మీకు గుండె జబ్బుల సమస్య లేకున్నా.. భవిష్యత్తులో వచ్చే ప్రమాదం ఉంది. తరచుగా ఛాతి నొప్పి వస్తున్నా అనుమానించాలి.
మర్మాంగాల వద్ద గడ్డలు: ఈ సమస్యను అడిగి తెలుసుకోవడం కష్టమే. కానీ, పూర్తి హెల్త్ చెకప్ ద్వారా ఇలాంటి సమస్యలను గుర్తించవచ్చు. కొంతమంది పురుషులకు వృషణంలో గడ్డల్లాంటివి ఏర్పడతాయి. అయితే, అవి చిన్న వాపేనని భావించి డాక్టర్‌ను సంప్రదించరు. అది కూడా క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు వృషణాలను చేతితో పట్టుకుని రోల్ చేయడం ద్వారా ఈ సమస్యను తెలుసుకోవచ్చు. కాబట్టి, పురుషులకు ఈ సమస్యపై తప్పకుండా అవగాహన ఉండాలి.
మలంలో రక్తం: మలంతోపాటు రక్తం వస్తున్నట్లయితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. అయితే, చాలామంది మలంతోపాటు వచ్చే రక్తస్రావాన్ని పైల్స్ వల్ల వస్తుందని భావిస్తారు. అకస్మాత్తుగా బరువు కోల్పోయినా, అలసటగా అనిపించినా, పొత్తికడుపులో నొప్పిగా ఉన్నా పేగుల్లో సమస్య ఉన్నట్లు అర్థం. అది క్యాన్సర్ కూడా కావచ్చు. కాబట్టి, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
Also Read: ‘ఫాదర్స్ డే’ రోజున మీ నాన్నకు తెలుగులో ఇలా శుభాకాంక్షలు చెప్పండి
మీరు నాన్నకు గిఫ్ట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పర్వాలేదు. ఏడాదిలో ఒక్కసారైనా ఆయనకు హెల్త్ చెకప్ చేయించండి. తాను చాలా స్ట్రాంగ్ అనే ఫీలయ్యే ‘సూపర్ మ్యాన్ సిండ్రోమ్’ నుంచి బయటపడేయండి. ఏమైనా అనారోగ్యాన్ని గుర్తిస్తే.. ఆయనకు ధైర్యం చెప్పండి. తోడుగా ఉండండి. నాలుగు మాటలు చెప్పి ఆయన మనసును తేలికపరచండి. ఆయన ఆరోగ్యాన్ని గమనిస్తూ.. కంటిపాపలా చూసుకోండి. ఆయన మీపై చూపించిన ప్రేమను తిరిగి ఇచ్చేయండి. ఎందుకంటే.. మన బాగు కోరుకున్న నాన్న.. బాగుండాలి. మీ ప్రేమను చూసి మురిసిపోవాలి.
Also Read: 11 మినిట్స్, 7 హవర్స్, త్రిపుల్ 20 - ఇవి మీ ఆయుష్సును ఏ విధంగా నిర్ణయిస్తాయో తెలుసా?
గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్యుల సూచనల ఆధారంగా ఈ కథనాన్ని అందించాం. ఇది పూర్తిగా మీ అవగాహన కోసం అందించిన కథనం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.