కొన్ని సంఖ్యలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయనే సంగతి మీకు తెలుసా? అయితే, మీరు దీని గురించి సంఖ్యా శాస్త్రాన్ని తిరగేయక్కర్లేదు. మీ చేతిలో ఆయుష్సు రేఖలను చూసి లెక్కలు వేసుకోక్కర్లేదు. జస్ట్, మీ జీవితంలో కొన్ని క్షణాలను మీ ఆరోగ్యం గురించి కేటాయిస్తే చాలు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోవడం ద్వారా మీరు ఆయుష్సును పెంచుకోవచ్చు. మరి, ఆ సంఖ్యలేమిటీ? అవి మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో చూసేద్దామా?


ముందు 1తో ప్రారంభిద్దాం: మీరు రోజుకు ఒక గుడ్డు తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటారో తెలుసా? రోజుకో గుడ్డు తినడం వల్ల రక్త ప్రసరణ అదుపులో ఉంటుంది. కొవ్వు కరుగుతుంది. గుడ్డులో ఉండే విటమిన్స్, మినరల్స్ గుండె పోటు, స్ట్రోక్ సమస్యల నుంచి గట్టెక్కిస్తాయి. కేవలం గుడ్డు తినడమే కాదు. మరికొన్ని ఆరోగ్యకర అలవాట్లు కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవేంటో చూసేయండి. 


20, 20, 20 రూల్ (త్రిపుల్ 20): మీకు అల్రెడీ కంటి చూపు సమస్యలున్నాయా? కళ్లజోడు వాడుతున్నారా? ఎక్కువ సేపు ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తున్నారా? లేదా ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ఆపకుండా వెబ్ సీరిస్‌లు లేదా సినిమాలు చూస్తున్నారా? అయితే, మీరు ఈ త్రిపుల్ 20 రూల్ పాటించాల్సిందే. మీరు స్క్రీన్ చూసే సమయంలో కొన్ని సెకన్లు కంటికి విశ్రాంతి ఇచ్చేందుకు ప్రయత్నించండి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి.. మీకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్ల పాటు చూస్తే చాలు. దీనివల్ల మీ కళ్లు ఎక్కువగా అలసిపోవు. ఫలితంగా మీకు భవిష్యత్తులో తీవ్రమైన కంటి చూపు సమస్యల ముప్పు తగ్గుతుంది. అంతేగాక, తలనొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కళ్లు ఎక్కువ కాలం ఆరోగ్యకరంగా ఉంటాయి. 


ప్రతి 30 నిమిషాలకు నిలబడండి: చాలామంది రోజూ 8 నుంచి 9 గంటలు చొప్పున కూర్చొనే ఉంటారు. ఎక్కువ సేపు సీట్లో కూర్చోవడం ఆరోగ్యకరం కాదు. కాబట్టి, మీరు ప్రతి అరగంటకు ఒకసారి సీటు నుంచి లేచి నిలబడండి. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాల చొప్పున నిలబడినట్లయితే.. మీలో బ్లడ్ సుగర్, కొవ్వు స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయని బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ వెల్లడించింది. ఇలా చేయడం వల్ల ఊబకాయం, మధుమేహం, బరువు పెరిగే సమస్యల నుంచి బయటపడతారు. 


7 గంటల(7 హవర్స్) సేపు నిద్రపోండి: నిద్ర మీ ఆయష్సును, ఆరోగ్యాన్ని శాసిస్తుంది. మీరు ఎంత బాగా నిద్రపోతే అన్నేళ్లు హాయిగా బతికేస్తారు. అలాగని అతిగా నిద్రపోవక్కర్లేదు. రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోండి చాలు. రోజుకు 7 గంటల నిద్రతో మీ బ్రెయిన్‌కు రిఫ్రెష్, రీఛార్జ్ అయ్యేందుకు సమయం లభిస్తుందని చైనా, కేంబ్రిడ్జ్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. నిద్రవల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏడు గంటలు కంటే అతిగా లేదా తక్కువగా నిద్రపోతే అనారోగ్య సమస్యలు తప్పవు. 


11 నిమిషాలు: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే గంటలకొద్ది వ్యాయామాలు చేస్తూ చెమటలు చిందించాల్సిన అవసరం లేదు. నార్వే పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజూ కనీసం 11 నిమిషాలపాటు వేగంగా నడిస్తే చాలు. అంతేకాదు, కాసేపు మీ ఇంట్లో గార్డెన్ వర్క్ చేసినా, కిరాణా సామాన్లను లిఫ్ట్‌లో కాకుండా మెట్ల మీద నుంచి తీసుకెళ్లినా చాలు.. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈ అలవాట్ల వల్ల గుండె సమస్యలు, టైప్-2 డయాబెటిస్‌లు దరిచేరవు. 


13 నిమిషాల ధ్యానం: రోజూ 13 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ధ్యానం వల్ల మీ మనసు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. మీకు ఇష్టమైన మ్యూజిక్ వింటూ 13 నిమిషాలు అలా ధ్యానం చేయండి చాలు, ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. బల్టీమార్‌లోని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ధ్యానం మిమ్మల్ని డిప్రెషన్, ఆత్రుత వంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది. 


చక్కని ఆరోగ్యం కోసం ఈ అలవాట్లను కూడా అలవరుచుకోండి: 


⦿ మీ కూరల్లో తప్పకుండా పసుపు ఉండేలా చూసుకోండి. పసుపులో ఉండే కర్క్యుమిన్ (curcumin) గుండె సమస్యలు, క్యాన్సర్, టైప్-2 డయాబెటిస్‌ కారకాలతో పోరాడుతుంది. అంతేకాదు, ఇది కణాలను సైతం మరమ్మత్తు చేస్తుంది. ముఖ్యంగా అల్జిమర్స్ వ్యాధితో మతిమరపు సమస్యలను ఎదుర్కొనే బాధితులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటి-ఇన్‌ఫ్లామ్మటరీ ప్రోపర్టీస్ కీళ్లనొప్పులు (arthritis) నుంచి కాపాడుతుంది. 
⦿ వారంలో కనీసం రెండుసార్లు చేపలు తినడం వల్ల కూడా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా సాల్మాన్ రకం చేపలు ఆరోగ్యానికి చాలా మేలుచేస్తాయి. చేపల్లోని ఒమెగా-3 గుండె సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది. 
⦿ రెడ్ వైన్‌లోని యాంటీఆక్సిడెంట్లు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. రక్తం గడ్డకట్టే అవకాశాలను తగ్గిస్తాయి. రోజూ రెడ్ వైన్ తాగేవారిలో పెద్దప్రేగు, అండాశయ క్యాన్సర్‌ల అవకాశాలు తగ్గుతాయి. కానీ, ఒక గ్లాస్ కంటే ఎక్కువ వైన్ తాగితే ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. మితంగా తాగితేనే ప్రయోజనాలు లభిస్తాయి. 
⦿ రోజూ మీరు స్నేహితులతో సరదాగా గడపడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తక్కువ సామాజిక సంబంధాలు కలిగిన వ్యక్తులు త్వరగా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేవారు.. ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందన్నారు.  
⦿ కాఫీ మంచిదే: రోజూ ఒక కాఫీ తాగడం కూడా ఆరోగ్యకరమే. 2015లో హార్వర్డ్ యూనివర్శిటీ జరిపిన అధ్యయనంలో రోజూ కాఫీ తాగే వారికి ప్రాణాపాయం తగ్గుతుందని తేలింది. కాఫీ కాఫీ నాడీ వ్యవస్థను కూడా ప్రేరేపిస్తుందని, అది కొవ్వు ఆమ్లాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుందని పరిశోధకులు తెలిపారు.  
⦿ నట్స్ గుండె జబ్బులు, డయాబెటిస్, అధిక రక్తపోటు, వివిధ క్యాన్సర్‌లను నివారిస్తాయట. స్పెయిన్ పరిశోధనల ప్రకారం.. నట్స్ తినేవారిలో అకాల మరణ రేటు మూడోవంతు తగ్గుతుంది. కాబట్టి, మీరు అన్ని రకాల నట్స్ లేదా డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. 


Also Read: ఇట్స్ బాయ్ థింగ్, అబ్బాయిలూ ఉదయాన్నే అలా జరక్కపోతే, త్వరగా చచ్చిపోతారట!


Also Read: కారులో సెక్స్ చేసిన మహిళకు రూ.40 కోట్లు పరిహారం, ఇదెక్కడి విడ్డూరం!


గమనిక: వివిధ అధ్యయనాలు, పరిశోధకులు తెలిపిన వివరాలను మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, సందేహాలున్నా.. తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు.