ఓ పార్టీ గుర్తుంపై గెలిచారు... అధికార పార్టీ అండ కావాలనుకొని పార్టీ ఫిరాయించారు. నాలుగేళ్లు గిర్రున తిరిగేసరికి ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో ఎక్కువ మందిని చాలా భయపెడుతోంది. కొందరు ఇప్పటి వరకు వర్గపోరుతో సతమతమైతే... ఇప్పుడు ఇంటిపోరు కంగారు పెట్టిస్తోంది. 


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఒకే స్థానానికి పరిమితం కావడంతో వైసీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు పారీ పిరాయించారు. 2018 ఎన్నికల్లో సిట్టింగ్‌లకు టీఆర్‌ఎస్‌ టిక్కెట్లు ఖరారు చేసింది. అందులో కేవలం కేవలం ఒకరు మాత్రమే విజయం సాధించారు. మిగిలిన ఫిరాయింపుదారులు ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాలకు కేవలం ఒక్కస్థానానికి మాత్రమే పరిమితమైంది. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కేవలం ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాత్రమే విజయం సాధించారు. ఆరు స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా రెండు స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ నుంచి విజయం సాదించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్‌గా గెలిచిన అభ్యర్థి సైతం కారు ఎక్కేశారు. 


రెండు వర్గాలుగా టీఆర్‌ఎస్‌ పార్టీ.. 


పార్టీ పిరాయింపులు కారణంగా టీఆర్‌ఎస్‌ పార్టీలోని పాత, కొత్త నాయకుల మధ్య వర్గపోరు మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రెండు వర్గాలుగా టీఆర్‌ఎస్‌ పార్టీ నడుస్తోంది. నాయకులు పైకి కలిసినట్లు కనిపిస్తున్నప్పటికీ ప్రత్యర్థులను అదను చూసి దెబ్బతీయాలనే వ్యూహాలు పన్నుతున్నారు. ఎవరికివారు తమ క్యాడర్‌ గల్లంతు కాకుండా చూస్తూ పైచేయి సాధించాలనే వ్యూహంతో ముందుకు సాగారు.


ప్రధానంగా పాలేరు, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో ఈ వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఎలాగైనా టిక్కెట్‌ దక్కించుకోవాలని ప్రస్తుత సిట్టింగ్‌లు, మాజీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు.  వైరా లాంటి నియోజకవర్గాల్లో ముగ్గురు పోటి పడుతుండటంతో అసలు ఈ దపా టిక్కెట్‌ ఎవరికి వస్తుందనే లెక్కల్లో అధికార పార్టీ నాయకులు మునిగిపోయారు.


ఓ వైపు మాజీలు తమదే ఈసారి టిక్కెట్‌ అని బహిరంగంగా ప్రచారం చేసుకుంటుంటే.. పార్టీ పిరాయింపులకు పాల్పడిన వారిలో గుబులు రేగుతోంది. రెండు సార్లు ఖమ్మంలో అపజయాన్ని మూటగట్టుకున్న టీఆర్‌ఎస్‌ ఈసారి ఎలాగైనా ఖమ్మంలో పాగా వేయాలని చూస్తోంది. దీంతో  ఎవరికి టిక్కెట్‌ కేటాయిస్తారనే విషయంపై తీవ్రంగా చర్చ సాగుతుంది. సెంటిమెంట్‌ ప్రకారం... ఫిరాయింపుదారులు రెండోసారి గెలవకపోవడం కూడా నేతలను మరింత కలవరానికి గురి చేస్తోంది.