మహిళలు ఇంట్లో వాళ్ళ మీద చూపించే శ్రద్ధ తమ ఆరోగ్యం మీద తక్కువగా చూపిస్తారు. సరైన టైమ్ కి తినకపోవడం సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా తొందరగా అనారోగ్యాల బారిన పడతారు. పోషకాహారం తీసుకోకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు పలకరించేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం నిర్ధిష్ట హార్మోన్ల లోపం కారణంగా దాదాపు 69 శాతం మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అది వారి ఆరోగ్య పరిస్థితిని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఫలితంగా కరోనరీ ఆర్టరీ వ్యాధి(CAD) బారిన పడుతున్నారు.


సాధారణంగా 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వ్యక్తులని ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది. CAD అనేది అథెరోస్క్లెరోసిస్ అని పిలిచే కొవ్వుల నిర్మాణం ద్వారా గుండెకు రక్తనాళాలు నిరోధించేలా చేస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే అది గుండె పోటు లేదా స్ట్రోక్ కి దారి తీసే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి వచ్చినప్పుడు గుండె, మెదడుకి రక్తం, ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. ఈస్ట్రోజెన్ లోపం ఉన్న మహిళలు ఈ పరిస్థితికి ఎక్కువగా గురవుతారని పరిశోధకులు చెబుతున్నారు.


ఈస్ట్రోజెన్ లోపానికి CAD సంబంధం ఎలా?


అండాశయ పనితీరుకి ఆటంకం కలగడం వల్ల హార్మోన్ లోపం ఏర్పడి అది CADకి కారణం అవుతుందని పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో పాల్గొన్న మహిళలు చిన్న వయస్సు వాళ్ళు అయినప్పటికీ గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.


లోపానికి కారణాలు


☀ పోషకాహార లోపం, తగినంత ఆహారం తీసుకోకపోవడం, అనోరెక్సియా లేదా బులిమియా వంటి రుగ్మతలు  


☀ ఒత్తిడి


☀ హైపోథాలమిక్ అమెనోరియా.. అంటే అండాశయాల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కోసం మెదడు తగినంత హార్మోన్లని విడుదల చేయలేకపోవడం


☀ అతిగా వ్యాయామం చేయడం


వీటన్నింటి కారణంగా ఈస్ట్రోజెన్ లోపం జరిగే అవకాశం ఉంది.


అధ్యయనం ఏం చెబుతోంది?


తక్కువ ఈస్ట్రోజెన్ స్థాయిలు ఉన్న స్త్రీల రక్తనాళాలు కప్పే కణాలు పేలవంగా పని చేస్తున్నాయని గతంలో చేసిన అధ్యయనాలు వెల్లడించాయి. సాధారణంగా రక్త నాళాలు నిర్దిష్ట పదార్థాలతో సంకర్షణ చెందుతున్నపుడే రక్తం గుండె వెళ్ళడానికి అవి వ్యాకోచిస్తాయి. కానీ ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువ ఉన్న మహిళల్లో ఇది జరగకపోవచ్చు. ఈస్ట్రోజెన్ లోపం వల్ల మహిళలు చిన్న వయస్సులోనే రక్తపోటు లేదా గుండె వైఫల్యం సమశయలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


ఈస్ట్రోజెన్ లోపం లక్షణాలు


☀ మూడీగా లేదా ముభావంగా ఉండటం


☀ చిరాకు


☀ రొమ్ముల్లో మార్పులు


☀ పెళుసు, బలహీనమైన ఎముకలు


☀ పొడి బారిన చర్మం


☀ ఏకాగ్రత ఇబ్బందులు


☀ వేడి సెగలు లేదా వేడి ఆవిర్లు


☀ రాత్రి వేళ అతిగా చెమటలు పట్టడం


☀ వజీనా పొడిబారిపోవడం


☀ పీరియడ్స్ అసలు రాకపోవడం లేదా క్రమం తప్పి పీరియడ్స్ రావడం


మహిళల్లో ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ స్థాయిలు సమతుల్యంగా ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. అలా అని ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా అయితే నెలసరి సమయంలో నొప్పి వస్తుంది. ఈ రెండు హార్మోన్ల మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: మీ పిల్లల కడుపు నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు, అది ప్రమాదకరం కావచ్చు