స్కూల్ కి డుమ్మా కొట్టడానికి పిల్లలు చెప్పే మొదటి అబద్ధం కడుపు నొప్పి. ఎక్కువ మంది చిన్నారులు తమ తల్లిదండ్రులకి చెప్పే అబద్ధం ఇదే. అయితే ఎక్కువసార్లు అదే కారణం చెప్పడం వల్ల నిజంగా కడుపు నొప్పి వచ్చినా కూడా ఒక్కోసారి తల్లిదండ్రులు పట్టించుకోరు. కానీ అలా చేస్తే అది తీవ్రమై ప్రమాదకరంగా మారవచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు పొత్తి కడుపులో నొప్పి లేదా తిమ్మిరిగా అనిపిస్తే ఏదో ఇబ్బంది ఖచ్చితంగా ఉందని తల్లిదండ్రులు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. వెంటనే వాళ్ళని వైద్యుల దగ్గరకి తీసుకెళ్లడం అవసరం. అయితే ఎటువంటి కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరకి వెళ్లాలి అనే దాని గురించి నిపుణులు కొన్ని సూచనలు చేశారు.


నొప్పి తీవ్రతని బట్టి ఎరుపు, పసుపు(amber), ఆకుపచ్చ కేటగిరీలుగావాటిని విభజించారు. మీ పిల్లల్లో కనిపించే లక్షణాలు రెడ్ కేటగిరీలోకి వస్తే అత్యవసర చికిత్స అవసరం కావచ్చు.


రెడ్ కేటగిరీ లక్షణాలు


☀ వాంతుల్లో రక్తం


☀ మలం ముదురు ఆకుపచ్చ రంగులో రావడం


☀ అబ్బాయిల్లో అయితే వృషణాల నొప్పి


☀ పిల్లలు పాలిపోయినట్టుగా కనిపించడం


☀ ట్యాబ్లెట్ వేసిన కూడా తీవ్రమైన నొప్పి


రెడ్ కేటగిరీ లక్షణాలు కనిపించకపోతే కాస్త ప్రమాద తీవ్రత తగ్గినట్టే. Ambar కేటగిరీ లక్షణాలు కనిపిస్తే కంగారుగా డాక్టర్ దగ్గరకి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. నొప్పి తగ్గించేందుకు ఇంట్లోనే ఏదైనా చికిత్స చేయవచ్చు. కానీ నాలుగు గంటలకి పైగా నొప్పి అలాగే కొనసాగితే మాత్రం వీలైనంత వరకు డాక్టర్ ని సంప్రదించాలి.


☀ మలం లేదా మూత్రంలో రక్తం


☀ చర్మం లేదా కళ్ళు పసుపు రంగులోకి మారడం(కామెర్లు)


☀ పొట్ట ఉబ్బడం


☀ విపరీతమైన దాహం


☀ సాధారణం కంటే ఎక్కువగా మూత్రవిసర్జన


☀ పెయిన్ కిల్లర్ తీసుకున్నప్పటికి ఒక రోజుకి పైగా నిరంతర నొప్పి


☀ ఐదు రోజులకి పైగా జ్వరం


☀ అకస్మాత్తుగా బరువు తగ్గడం


ఆకుపచ్చని కడుపు నొప్పి లక్షణాలు


ఎరుపు, పసుపు లక్షణాలు లేనప్పటికీ కడుపులో అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉంది. ఎంత చేసిన నొప్పి తగ్గకపోతే వైద్యులని సంప్రదించడం ఉత్తమం. నొప్పి తగ్గేందుకు డాక్టర్ సలహా ప్రకారం మందులు వేసుకోవాలి.


☀ తరచుగా మలబద్ధకం


☀ బాలికల్లో అయితే విపరీతమైన పీరియడ్స్ సంబంధిత నొప్పి


☀ విరోచనాలు


☀ వాంతులు


పసి పిల్లలు అయితే తమకి కడుపు నొప్పి వస్తే చెప్పలేని పరిస్థితి. తల్లిదండ్రులు సమయానికి అర్థం చేసుకుని వారికి తగిన చికిత్స ఇప్పించాలి. ఎక్కువ శాతం మంది పిల్లలు ఎదుర్కొనే సాధారణ సమస్య ఇది. అటువంటి సమయంలో వారితో చికాకు, కోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అల్లం టీ, పుదీనా టీ, పెరుగుతో భోజనం పెట్టడం వల్ల పిల్లల్లో కడుపు నొప్పి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి వాళ్ళు తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల కూడా నొప్పి వస్తుంది. పొట్ట మీద కొబ్బరి నూనె లేదా ఆముదం వేసి వేడి నీటితో మర్దన చేసిన కూడా ఫలితం లభిస్తుంది.   


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మీ మూడ్ మార్చి హ్యాపీగా ఉంచే జాయ్ వర్కౌట్ - ఎలా చెయ్యాలో చూసెయ్యండి మరి


రోజుకో గ్లాసు రాగి జావ