ఏపీలో మరో సలహాదారుగా నటుడు అలీని నియమిస్తూ సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవికి అలీని ఎంపిక చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల అలీ సంతోషం వ్యక్తం చేశారు. జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు.
ఇప్పటికే ఇద్దరు సలహాదారులతో ఉన్న మీడియా వింగ్‌కు మరో సలహాదారుగా హస్యనటుడు అలీని వైసీపీ ప్రభుత్వం నియమించింది. దీనిపై నటుడు అలీకి వైసీపీ ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. తనపై నమ్మకంతో జగన్ తనను గౌరవిస్తూ ఇచ్చిన పదవి పట్ల నటుడు అలీ ఆనందం వ్యక్తం చేశారు. సతీసమేతంగా ధన్యవాదాలు తెలిపారు.
భార్య జుబేదాతో కలసి ఓ వీడియోను రిలీజ్ చేశారు నటుడు అలీ. జగన్ ఇచ్చిన గౌరవానికి సంతోషంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు అలీ దంపతులు వివరించారు. పార్టీ ఏర్పాటు నుంచి జగన్‌తో తన ప్రయాణం కొనసాగిందని, ఈ సందర్భంగా అలీ గుర్తు చేసుకున్నారు. పార్టీలో చేరి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన సమయంలో కూడా జగన్‌ను కలసినప్పుడు అండగా ఉంటానని, తగిన న్యాయం చేస్తానని హమీ ఇచ్చారని తెలిపారు. ఆ తరువాత కూడా పార్టీలో విధేయుడిగా కొనసాగుతున్న తన పట్ల ప్రత్యేక అభిమానం చూపించారని అన్నారు.
రాజ్యసభ, ఎమ్మెల్సీ అంటూ చాలా మంది ప్రచారం చేశారని అయితే పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు తాను కామెంట్స్ చేయనని మెదట్లోనే చెప్పానన్న విషయాన్ని ఆలీ గుర్తు చేశారు. పదవులు, హోదాలు, ఆశించి తాను పార్టీలో కొనసాగబోనని గతంలోనే జగన్‌కు వివరించానని ఆలీ స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా జగన్ తనను నియమించి బాధ్యతలను అప్పగించటం ఆనందంగా ఉందన్నారు. జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా శిరసావహిస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేసిన విషయాన్ని ఆలీ గుర్తు చేసుకున్నారు.
షుక్రియా జగన్ భాయ్: జుబేదా
జగన్‌కు అలీ భార్య జుబేదా కూడా ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది చాలా సార్లు అడుగుతున్నారని, వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియలేదని జుబేదా సంతోషంతో అన్నారు. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని, తమ ఇంటిలో పండుగ వాతావరణం నెలకొందని జుబేదా వివరించారు. జగన్ ఇచ్చిన అవకాశంతో అందరికి సమాధానం దొరికిందని ఆమె కామెంట్ చేశారు.
రాజ్యసభ, ఎమ్మెల్సీ అంటూ ప్రచారం
తెలుగు రాష్ట్రాల్లో అలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. వెండితెర, బుల్లితెరపై ఆయన చాలా పాపులర్. సినీ గ్లామర్‌తో వైసీపీలో చేరారు. పార్టీ విజయం కోసం ప్రచారం కూడా చేశారు. అలా జగన్‌కు అత్యంత దగ్గర అయ్యారు. దీంతో అలీకి నామినేటెడ్ పదవి ఇస్తారని, ప్రచారం జరిగింది. రాజ్యసభ ఖాళీ అయినప్పడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయినప్పుడల్లా అలీ పేరు చక్కర్లు కొట్టింది. అయితే చివరకు అలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చారు.