Janasena PAC Meeting :    జనసేన పార్టి రాజకీయ వ్యవహరాల కమిటి (పీఎసీ) సమావేశం కు డేట్ ఫిక్స్ అయ్యింది..ఈనెల 30వ తేదీన సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.పార్టి అద్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటుగా పార్టి అగ్రనేతలు నాదెండ్ల మనోహర్,నాగబాబు ఇతరనాయకులు సమావేశంలో పాల్గొంటారు. ఇటీవల విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన తరువాత పరిణామాలను గురించి పార్టిలో అంతర్గతంగా చర్చించి భవిష్యత్ కార్యచరణను రెడీ చేస్తామని పార్టి వర్గాలు ప్రకటించాయి.రెండు రోజుల పాటు పవన్ పార్టి కార్యాలయంలో నే రాజకీయ వ్యవహరాలను గురించి చర్చిస్తారు.  జనసేన పార్టి అద్యక్షుడు పవన్ కళ్యాణ్ అద్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.


విశాఖ ఎయిర్ పోర్టు ఘటనపై జనసేన పీఏసీలో చర్చించనున్న పవన్ 


విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ ఘటన పై   కీలకంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఘటన జరిగిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలు గురించి   లోతుగా చర్చించటంతో పాటుగా భవిష్యత్ కార్యచరణను రెడీ చేసేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టి వర్గాలు  ప్రకటించాయి. విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్దితులు,రాజకీయంగా   ఈ అంశంలో కలసి వచ్చిన అంశాలతో పాటుగా అదికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు అవసరం అయిన మిగిలిన అస్త్రాలను ఎలా రెడీ చేయాలి.. ఇందుకు అవసరం అయిన చర్యలు తీసుకునే విషయాలు గురించి  పవన్ కీలకంగా చర్చిస్తారు. 


పవన్‌పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలపైనా చర్చ


ఇదే సమయంలో పవన్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు,మంత్రులు చేసిన వ్యాఖ్యల పై కూడ చర్చించాలని నాయకులు భావిస్తున్నారు.విశాఖ ఘటన పై న్యాయ పరంగా కూడ ముందుకు వెళ్ళాలని పవన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.దీని పై కూడ పార్టి నేతలతో చర్చించే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్‌సీపీ నేతలు పూర్తిగా వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. పవన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ.. మూడు పెళ్లిళ్ల  అంశంపై ప్రతీ రోజూ ఏదో ఓ కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ అంశంపై మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది. వీటిపైనా చర్చించే అవకాశం ఉంది. 


బస్సు యాత్ర రూట్ మ్యాప్‌ను ఖరారు చేసుకునే అవకాశం
 
ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని కూడ  నిర్ణయించారు.అయితే ఇప్పటికే పలు దఫాలుగా ఈ నిర్ణయం వాయిదా పడుతూ వస్తుంది.సంక్రాంతి తరువాత బస్సు యాత్ర చేయాలని కూడ పవన్ నిర్ణయంచారు.ఇందుకు సంబందించిన అంశాల పై కూడ రాజకీయ వ్యవహరాల కమిటి సమావేశంలో చర్చించనున్నారు.  బస్సు యాత్ర ఎంత కాలం చేయాలి.. ఎలా చేయాలి... ఎఏ నియోజకవర్గాల గుండా వెళ్లాలన్నదానిపై రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. అలాగే ఇటీవల పవన్ కల్యాణ్.. చంద్రబాబు మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను పవన్.. పీఏసీ ముందు ఉంచే అవకాశం ఉంది. భవిష్యత్ వ్యూహంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.