Tekkali YSRCP :  ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్‌ను జగన్ ఖరారు చేశారు. అక్కడ మూడు, నాలుగు వర్గాలు ఉండటంతో  చివరి క్షణంలో టిక్కెట్ ఖరారు చేస్తే సమస్య అని.. ముందుగానే అందర్నీ పిలిచి దువ్వాడకు టిక్కెట్ ఖరారు చేసి రేసులో ఉన్న ఇతర నేతలకు పార్టీ  కోసం పని చేయాలని స్పష్టం చేశారు. అలా చేస్తేనే పదవులు ఉంటాయన్నారు. 


పీకే టీం ఎంపిక చేసిన వారితో జగన్ భేటీ 


ప్రశాంత్ కిషోర్ టీం ఎంపిక చేసిన 71 మంది టెక్కలి వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులతో జగన్ క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు. వీరిలో అత్యధికులు వచ్చే  ఎన్నికల్లో అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్‌కు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.   'మా మండలంలో 19 మంది సర్పంచ్లు, 11మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఎవ్వరం ఆయన గడప ఎక్కడంలేదు. ఎందుకంటే.. ఇంతకు ముందు వెళ్లి అవమానపడ్డాం. ఆయనకు టిక్కెటిస్తే చేయలేం.’ - ఇది కోటబొమ్మాళి ఎంపీపీ  రోణంకి మల్లయ్య  నేరుగానే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సీఎం  జగన్ మాత్రం వారి అభిప్రాయాలను పట్టించుకోలేదు. దువ్వాడకే టిక్కెట్ ఖరారు చేశామని గెలిపించి తీరాలని ఆదేశించారు. 


మెజార్టీ వ్యతిరేకించినా దువ్వాడనే అభ్యర్థిగా ప్రకటించిన జగన్ 


మెజార్టీ క్యాడర్ వ్యతిరేకించినా  దువ్వా డనే అభ్యర్థిగా జగన్ ప్రకటించడంతో జగన్‌ ఆయనపై నమ్మకం పెట్టుకున్నారని.. తాము ఆ మాత్రం నమ్మకం పొందలేకపోయామని నిరాశపడ్డారు. టెక్కలి నుంచి గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు దువ్వాడ శ్రీనివాస్. గత ఎన్నికల్లో పేరాడ తిలక్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి కూడా తనకే చాన్సివ్వాలని ఆయన అడుగుతున్నారు. కానీ ఆయనకు కార్పొరేషన్ పదవి ఇచ్చి   2024లో దువ్వాడ శ్రీను టెక్కలి నుంచి పోటీ చేస్తారని, ఆయన్ను గెలిపించుకు తీసుకురావాలని  అప్పుడే ఎమ్మెల్సీ ఇస్తానని తిలక్‌కు తేల్చి చెప్పారు. 


దువ్వాడను గెలిపిస్తే తిలక్‌కు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ 
 
అయితే దువ్వాడ శ్రీను వ్యవహారశైలి వల్ల క్యాడర్ ఆయనకు దూరంగా ఉంటోంది. విపక్షాలను ముఖ్యంగా అచ్చెన్నాయుడును అసభ్యంగా తిడుతూ ఉంటారు. అదే స్థాయిలో తనకు అనుకూలంగా లేరని సొంత పార్టీ నేతలనూ మాటలనేస్తూ ఉంటారు. దీంతో ఆయనకు చాలా మంది దూరమయ్యారు.  దువ్వాడ ఎన్ని మాటలన్నా... అచ్చెన్నాయుడు మాత్రం ఆయనను ఏమీ అనరు. అచ్చెన్న ఏమీ అనకపోయినా ఇష్టం వచ్చినట్లుగా దువ్వాడ తిడుతూండటంతో  అచ్చెన్నకు సానుభూతి పెరుగుతోందన్న వాదన వినపిస్తోంది. అదే సమయంలో జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేయడం కూడా కొన్ని వర్గాల్లో ఆయనపై వ్యతిరేకత మరింత పెరగడానికి కారణం అయింది. 


దువ్వాడ కలుపుకుని పోవాలని కోరుతున్న క్యాడర్ 
 
నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలా ల్లోనూ తన ప్రత్యర్థి వర్గానికి చెందిన నేతలున్నారని భావించకుండా ఎవరైనా వైకాపావారేనన్న భావనతో దువ్వాడ శ్రీను ముందుకెళితే ఫలితం ఉంటుందని వైసీపీ అభిమానులు అంటున్నారు. సమీక్షలో కృపారాణి, పేరాడ తిలక్లు మౌనంగానే ఉన్నారు. తిలక్‌కు సంబం ధించి సమీక్షలో అనేక మార్లు  ఎమ్మెల్సీ చేస్తా నని, గెలిపించుకురావాలని చెప్పినప్పటికీ కృపారాణికి ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఆమెకు ఎంపీ టిక్కెట్ ఇస్తారని భావిస్తున్నారు.