కొందరికి పొడి చర్మంతో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. పొడి చర్మం అనేది చర్మం పై పొర ఎపి డెర్మిస్‌లో తగినంత నీరు లేకపోవడం వల్ల వస్తుంది. కొంతమందికి స్వతహాగా పుట్టుకతోనే పొడి చర్మం వస్తుంది. మరికొందరికి వాతావరణంలో మార్పుల వల్ల చర్మం పొడిబారుతుంది. అలాగే వృద్ధాప్యంలో కూడా చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది. కొందరికి పొడి చర్మంతో చాలా సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణం పొడిగా ఉన్నా, వేడిగా ఉన్నా కూడా చర్మం పొడి బారే సమస్య పెరుగుతుంది. అలాగే అంతర్లీన వైద్య పరిస్థితిలు కూడా ఈ పొడి చర్మానికి కారణం అవుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.


వారసత్వంగా కూడా పొడి చర్మం వస్తుంది. అలాగే మధుమేహం, మూత్రపిండాల వ్యాధి బారిన పడిన వారు కూడా పొడి చర్మంతో ఇబ్బంది పడతారు. వయసు పెరిగే కొద్దీ స్వేదగ్రంథులు ఎండిపోతాయి. దీని వలన కూడా చర్మం పొడిగా మారి ఇబ్బంది పెడుతుంది. సెలూన్‌లో పనిచేసేవారు కూడా చర్మం పొడిబారే సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఎక్కువమందిలో పొడి చర్మం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.


పొడి చర్మం వల్ల త్వరగా ముడతలు పడతాయి. గీతలు కనిపిస్తాయి. చర్మం పాలిపోయినట్లు అనిపిస్తుంది. చిన్నచిన్న గాయాలకు కూడా రక్తం వస్తుంది. దురద కూడా పెడుతుంది. పెదాలు పగిలిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి మీరు ప్రతిరోజు దాదాపు మూడు లీటర్ల నీటిని కచ్చితంగా తాగాలి. ఇది చర్మాన్ని తేమవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే నీటి శాతం అధికంగా ఉండే పండ్లను రోజూ తినాలి. కూరగాయలను కూడా తింటూ ఉండాలి. పాలకూర వంటి వాటిలో నీరు అధికంగా ఉంటుంది. వాటిని రెండు రోజులకు ఒకసారి అయినా తింటూ ఉండాలి. కొబ్బరి నూనె ఒంటికి పట్టించుకోవడం వంటివి చేయాలి. అలాగే వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల చర్మం మరింతగా పొడిబారిపోతుంది. రసాయనాలున్న సబ్బులను కూడా వాడకూడదు. అలాంటి సబ్బులను వాడడం వల్ల సమస్య పెరుగుతుంది, కానీ తగ్గదు. 


పొడి చర్మం సమస్యతో బాధపడేవారు ఎండలో ఎక్కువసేపు తిరగకూడదు. ఎందుకంటే వాతావరణంలోని వేడి వారికి మరింతగా పొడితనాన్ని అందిస్తుంది. దీనివల్ల దురద, దద్దుర్లు వంటికి వచ్చే అవకాశం ఉంది. అలాగే కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోకూడదు. కాఫీ, ఆల్కహాల్ వంటి వాటికీ దూరంగా ఉండాలి. కాఫీలో ఉండే కెఫీన్ చర్మం పొడిబారడాన్ని మరింతగా పెంచుతుంది. 


Also read: కాల్చిన మొక్కజొన్న vs ఉడికించిన మొక్కజొన్న, రెండింట్లో ఏది బెటర్?


Also read: ఈ సమస్యలు ఉన్నవారు మొలకెత్తిన పల్లీలు తింటే మేలు








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.