KCR BRS :   దేశంలో ప్రస్తుతం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు, జమిలీ ఎన్నికలు, ఇండియా పేరు మార్పు అనే అంశాలపై రాజకీయం ఉద్ధృతంగా జరుగుతోంది.  రాజకీయాల్ని మార్చే పరిణామాలు జరుగుతున్నప్పుడు జాతీయ రాజకీయాల్లో తన దైన ముద్ర వేయాలనుకున్న వారు తమ ఖచ్చితమైన విధానాన్ని ప్రకటిస్తారు. ల కానీ ఈ విషయలో కేసీఆర్ మొదటి నుంచి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.   జమిలీ ఎన్నికలు, ఇండియా పేరును భారత్‌గా మార్చటం తదితర అంశాలపై బీఆర్ఎస్ అభిప్రాయం ఇప్పటి వరకూ అధికారికంగా వెల్లడి కాలేదు.  ఆ పార్టీ ముఖ్య నేతలెవరూ తాజా పరిణామాలపై మాట్లాడటం లేదు. చివరికి సనాతన ధర్మం అంశంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపైనా మాట్లాడలేదు. 


జాతీయ అంశాలపై మాట్లాడని జాతీయ పార్టీ నేత 
 
ప్రస్తుత పరిణామాలపై  కాంగ్రెస్‌ నుంచి కమ్యూనిస్టుల వరకూ… డీఎంకే నుంచి ఎన్సీపీ దాకా  తమ అభిప్రాయాలు చెబుతున్నాయి. బీజేపీని వ్యతిరేకించేవారు.. ప్రజా సమస్యలపై దారి మళ్లించి ప్రజలను భావోద్వేగాలకు  గురి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీకి మద్దతిచ్చే పార్టీలు భారత్ అనే పేరులో ఓ వైపు నిలబడ్డాయి. జమిలీ ఎన్నికల విషయంలోనూ అంతే.   బీఆర్‌ఎస్‌ బాస్‌ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. ఇటీవల  మహారాష్ట్ర పర్యటనలో నేను అధికార ఎన్డీయే కూటమికి, ప్రతిపక్ష   కూటమికి సమదూరం పాటిస్తానని చెప్పారు.  ఈ రెంటికీ సమదూరం అంటే ఏ అభిప్రాయం చెప్పకపోవడమా అన్న ఆశ్చర్యం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. 


గతంలో బీజేపీకి పలు కీలక అంశాల్లో మద్దతు 


గతంలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ మొదలుకుని అనేక విషయాల్లో కేంద్రానికి మొట్టమొదటగా బీజేపీకి మద్దతిచ్చింది బీఆర్‌ఎస్సే. ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్య రామమందిరం తదితర సందర్భాల్లో సైతం ఆ పార్టీ   బీజేపీని గట్టిగా వ్యతిరేకించలేదు.  రైతు చట్టాల విషయంలో ఇదే తంతు నడిచింది. మొదట పార్లమెంట్ లో మద్దతు ఇచ్చి వాటిని వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యాన రాస్తారోకోలు, రహదారుల దిగ్బంధనాలను చేపట్టారు.  దేశ శ్రేయస్సు, ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ‘పెద్ద నోట్ల రద్దు… జీఎస్టీ’కి జై కొట్టామంటూ కేటీఆర్‌ పలుమార్లు సమర్థించుకున్నారు.  భారత రాష్ట్ర సమితి అని చెప్పుకుంటూ… ఆ పేరుతో దేశాన్ని ఉద్ధరిస్తానని తిరుగుతూ జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే అంశాలపట్ల, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్న సమయాల్లో స్పందించకపోవటమంటే అది పరోక్షంగా ఢిల్లీలోని పాలకపక్షానికి సహకరించటమేనని ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. 


సరైన సమయంలో స్పందించడం కేసీఆర వ్యూహం - ఇప్పుడూ అమలు చేస్తున్నారా ? 
 
నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ..అన్నట్లుగా ఇప్పుడు కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారు.  బీజేపీ విషయంలో  కేసీఆర్  విభిన్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఓ సారి యుద్ధమంటారు.. మరోసారి పార్టీని కాపాడుకోవాలంటే సైలెంట్ గా ఉండాలంటారు.. మళ్లీ సందర్భం రాగానే....  యుద్ధం ప్రారంభిస్తారు.   జమిలీ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసి ప్లాన్ చేశారని అంటున్నారు. కేసీఆర్ ది పేరుకే జాతీయ పార్టీ కానీ  ఆ పార్టీ తెలంగాణకే పరిమితం కాబట్టి తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నం అని అనుకోవచ్చు.  అయినా కేసీఆర్ నోరు మెదపలేకపోతున్నారుని భావిస్తున్నారు.   కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో మౌనం అనేది మొదటి అస్త్రం.  అయితే దాన్ని పదే పదే వాడితే  పదును పోతుంది. కేసీఆర్ ప్రతీ దానికి మౌనం అస్త్రమే ప్రయోగిస్తున్నారు. ఎంద వరకూ వర్కవుట్ అవుతుందన్నది వేచి  చూడాల్సి ఉంది.