మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు అర్థరాత్రి వచ్చిన పోలీసులు కేసుల వివరాలు మాత్రం చెప్పడం లేదు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. టీడీపీ అడ్వకేట్లు అడుగుతున్నా సమాధానం దాట వేస్తున్నారు.
కేసుతోపాటు ఇతర వివరాలన్నీ చంద్రబాబుకు లేదా ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌కు మాత్రమే చెబుతామంటున్నారు పోలీసులు. అంతకు మించి వేరే వివరాలు వెల్లడించడం లేదు. పూర్తిగా గోప్యత పాటిస్తున్నారు.
టీడీపీ నేతలతో మాట్లాడిన సందర్భంగా డీఐజీ రఘురామిరెడ్డి ఓ చిన్న హింట్ ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు విదేశాలకు పారిపోయారని చంద్రబాబు కూడా పారిపోతారనే అనుమానంతో వచ్చామన్నారు. దీన్ని బట్టి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులోనే మూమెంట్ ఉందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఈ మధ్య కాలంలో చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. వేరే కేసులో ఈ నోటీసులు ఇచ్చినప్పటికీ స్కిల్‌డెవలప్‌మెంట్‌తో లింక్ పెట్టి అరెస్టు చేయబోతున్నారని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు పుంగనూరు, అంగళ్ల కేసులో కూడా అరెస్టు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఘటనపై చంద్రబాబుతోపాటు ఇతర నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసులో కూడా అరెస్టు జరిగే ఛాన్స్ లేకపోలేదనే వాదన బలంగా ఉంది.
రాజధాని భూముల వ్యవహారం కేసు కూడా చంద్రబాబుతోపాట ఇతర టీడీపీ నేతలపై ఉంది. ఆ కేసుతోపాటు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సిట్ ఏర్పాటు చేసిందీ వైసీపీ ప్రభుత్వం. దీంట్లో విచారణకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చింది.
ఇలా రకరకాల ఊహాగానాల మధ్య నంద్యాలలో ఉద్రిక్తత నెలకొంది. ఏ కేసు సిట్‌కు అప్పగించారో తెలియడం లేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందల సంఖ్యలో వచ్చి పోలీసులు ఓవైపు, చంద్రబాబు రక్షణగా ఉన్న టీడీపీ నేతలు, శ్రేణులు మరో వైపు. ఇలా ఇరు వర్గాల మోహరింపుతో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. సుమారు గంటల పాటు ఇది కొనసాగింది.
ముందుగా టీడీపీ శ్రేణులను నెట్టుకొని లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్న టీడీపీ నేతల వాహనాలను బలవంతంగా బయటకు పంపించేశారు. ప్రధానమైన నేతలు మినహా శ్రేణులను దూరంగా పంపేశారు. దీంతో మిగతా నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు అర్థరాత్రి రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. అయినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. తమ పనికి అడ్డుపడొద్దని హెచ్చరించింది.
చంద్రబాబు బయటకు రాకపోయినా, టీడీపీ లీడర్లు అడ్డు తొలగకపోయినా ఆయన విశ్రాంతి తీసుకుంటున్న బస్‌ను టోయింగ్ చేసుకొని తీసుకెళ్తామన్నారు. ఇలా సుమారు గంటల పాటు అక్కడ హైడ్రామా కొనసాగింది. అక్కడ ఉన్న టీడీపీ నేతలతోపాటు మీడియాను కూడా బయటకు పంపేశారు. మెడికల్ యూనిట్‌లను సిద్ధం చేశారు. చంద్రబాబును అరెస్టు చేస్తారని శుక్రవారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాతోపాటు కొన్ని న్యూస్ ఛానల్స్‌లో వస్తోంది.
నంద్యాలకు చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి పోలీసులను రప్పించారని టాక్ నడుస్తోంది. నిన్న సాయంత్రం నుంచే చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం చేశారని సమాచారం. లేదు లేదంటూనే సైలెంట్‌గా పని కానిచ్చేశారని ఈ పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. మొత్తం ఆరు బస్సుల్లో బలగాలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.