వాతావరణం చల్లబడిందంటే మొక్కజొన్నలు తినాలన్న కోరిక పెరుగుతుంది. ఉడికించిన లేదా కాల్చిన మొక్కజొన్నపై కాస్త ఉప్పు, కారం రాసుకొని తింటే ఆ మజాయే వేరు. వాన పడుతున్నప్పుడు వేడివేడి మొక్కజొన్న పొత్తులను తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే ఎంతో మందిలో ఉన్న సందేహం మొక్కజొన్నను కాల్చి తింటే ఆరోగ్యకరమా లేక ఉడికించి తింటే ఆరోగ్యకరమా అని. దీనికి పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.


ముందుగా మొక్కజొన్న పొత్తులను ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో ఫైబర్,  విటమిన్ బి,విటమిన్ ఏ, నియాసిన్, ఐరన్, పొటాషియం, జింక్, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణశక్తికి మేలు జరుగుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. డయాబెటిస్ రోగులు మొక్కజొన్నను కచ్చితంగా తినాలి. దీన్ని తినడం వల్ల వారి రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.


అంతేకాదు మొక్కజొన్న చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు దీనిలో ఎక్కువ. జుట్టును కూడా ఆరోగ్యంగా మారుస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను కూడా రాకుండా అడ్డుకుంటుంది. పిల్లలకు మొక్కజొన్నలు తినిపించడం చాలా ముఖ్యం. ఇది వారి ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. సన్నగా ఉన్న పిల్లలకు మొక్కజొన్నలు తినిపించడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.


అయితే ఉడికించి తినాలా, కాల్చి తినాలా అనే సందేహం ఎక్కువమందిలో ఉంది. నిజానికి మొక్కజొన్నను నీళ్లలో ఉడికించి తింటేనే ఎక్కువ ఆరోగ్యకరం. ఎలాంటి చెడు ప్రభావాలను ఉడికించిన మొక్కజొన్నలు కలిగించవు. కానీ కాల్చిన మొక్కజొన్నలు తినడం వల్ల మొక్కజొన్న గింజల్లో కొన్ని నల్లగా పైపైన మాడిపోతాయి. ఇలా నల్లగా మాడిన ఆహారాన్ని తినకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలా నల్లగా మాడిన ఆహారంలో క్యాన్సర్ కారకాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాల్చుకున్న మొక్కజొన్న కంటే ఉడికించిన మొక్కజొన్న తినడమే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. అలాగే వాటిపై పచ్చి ఉప్పు, కారాన్ని రాసుకోవడం తగ్గించండి. పచ్చి ఉప్పు, కారం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో చేటు జరుగుతుంది. ముఖ్యంగా పచ్చి ఉప్పు వల్ల అధిక రక్తపోటు బారిన త్వరగా పడతారు. ఉడికించిన మొక్కజొన్నను అలా సాదాగా తినేందుకే ప్రయత్నించండి. అవసరమైతే  నిమ్మకాయను రుద్దుకొని తింటే రుచి బాగుంటుంది. కానీ ఉప్పుని రాసుకోకపోవడమే అన్ని విధాలా మంచిది. 


Also read: ఈ సమస్యలు ఉన్నవారు మొలకెత్తిన పల్లీలు తింటే మేలు



Also read: పిల్లలకు గంట కంటే ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారా? వారి ఆరోగ్యం మీరే చెడగొడుతున్నట్టు లెక్క






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.