వేరుశెనగ పలుకులను పులిహారలో భాగంగా ఎక్కువమంది వాడతారు. వీటితో చట్నీ చేసుకుంటారు, కానీ మొలకెత్తిన గింజల్లో మాత్రం భాగం చేసుకోరు. నిజానికి మొలకెత్తిన విత్తనాలలో పల్లీలు కూడా ఒకటి. వీటిని రాత్రి నానబెడితే ఉదయానికి మొలకలు వస్తాయి. వాటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. రోజూ గుప్పెడు పల్లీలను రాత్రిపూట నానబెట్టి ఉదయం మొలకలు వచ్చాక తినండి. వీటిని రోజు తినడం అలవాటు చేసుకుంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే చెడు కొలెస్ట్రాల్ తగ్గిందో గుండెపోటు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా ఇలా మొలకెత్తిన పల్లీలను తినడం అలవాటుగా మార్చుకోవాలి. వీటిలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ కూడా అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.


అధిక బరువు సమస్య ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తోంది. బరువు పెరగకుండా కంట్రోల్ చేయడంతో పాటు పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ఈ మొలకెత్తిన పల్లీలు ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇతర ఆహారాలను తినేందుకు సమయం పడుతుంది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా నిండుగా ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు ఈ మొలకెత్తిన పల్లీలను రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా తినడం వల్ల అవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అంటే డయాబెటిస్ అదుపులో ఉంటుందన్నమాట. మొలకెత్తిన పల్లీలు తింటే ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. ఆర్థరైటిస్ వంటి నొప్పులతో బాధపడేవారు వీటిని తినడం అలవాటు చేసుకోవాలి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి తగ్గుతాయి.


మొలకెత్తిన పల్లీలు తినడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్టిక్ సమస్యలు ఉన్నవారు ఇలా మొలకెత్తిన పల్లీలను తినడం అలవాటు చేసుకోవాలి. ఆ సమస్యలన్నిటికీ ఇవి చెక్ పెడతాయి. జుట్టు ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో దోహదం చేస్తాయి. మన జుట్టు పెరుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు పల్లీలలో ఉంటాయి. నెల రోజులు పాటు మొలకెత్తిన వేరుశెనగ పలుకులను ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకోండి. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం మీరు గమనిస్తారు. కుదుళ్లు కూడా దృఢంగా మారుతాయి. నీరసం, అలసట వంటివి కూడా తగ్గుతాయి. కాబట్టి ప్రతిరోజు గుప్పెడు మొలకెత్తిన పల్లీలను తినేందుకు ప్రయత్నించండి. 


Also read: పిల్లలకు గంట కంటే ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారా? వారి ఆరోగ్యం మీరే చెడగొడుతున్నట్టు లెక్క






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.