రెండేళ్ల వయసు నుంచి పిల్లలు మొబైల్ ఫోన్లలో వీడియోలు చూడడం మొదలుపెట్టేస్తున్నారు. కొంతమంది అంతకన్నా తక్కువ వయసు పిల్లలకు కూడా ఫోన్లు ఇస్తున్నారు. పెద్దలు ఏదో ఒక పని చేసుకుంటూ పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఫోన్లలో బొమ్మలు చూస్తూ ఎక్కువమంది పిల్లలు గంటలు గంటలు అలాగే గడుపుతున్నారు. ముఖ్యంగా రెండేళ్ల నుంచి ఐదేళ్ల పిల్లల విషయంలో ఇలా ఎక్కువ జరుగుతోంది. పిల్లలు గంటల తరబడి టీవీ చూడడం లేదా ఫోను చూడడం వారి ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా ఆ వయసులో ఎదుగుదల అధికంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వారికి ఫోన్ ఇవ్వడం వల్ల మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. అన్నం తినేటప్పుడు వారికి ఎక్కువ మంది ఫోన్లు ఇస్తూ ఉంటారు. పిల్లలు ఫోన్ చూస్తూ ఉంటే అన్నం తినిపించడం చాలా సులువు అని తల్లిదండ్రులు నమ్మకం. కానీ ఫోన్ అలవాటు చేస్తే మీ పిల్లలు ఆరోగ్యాన్ని మీరే చెడగొట్టుకున్నట్టు అవుతుంది.


చిన్నప్పుడు ఫోన్ అధికంగా చూసే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. టీవీ, మొబైల్ అనేవి పిల్లల ఆరోగ్యం పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయిదేళ్లలోపు పిల్లలు రోజులో ఒక గంట కంటే ఎక్కువ సమయం ఫోన్ చూడకూడదని చెబుతోంది. పిల్లలకు ఎలక్ట్రానిక్ స్క్రీన్లను దూరంగా ఉంచాలని హెచ్చరిస్తోంది. ఎందుకంటే వారిపై రేడియేషన్ ప్రభావం పడే అవకాశం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో వారికి అనేక సమస్యలు వస్తాయి.


రెండేళ్ల వయసు దాటిన పిల్లలు ఫిజికల్ యాక్టివిటీస్‌లో అధికంగా పాల్గొనాలి. వారికి కంటి నిండా నిద్ర వచ్చేలా చూడాలి. పోషకాహారాన్ని అందించాలి. కానీ ఫోన్ అలవాటు చేసి ఒక మూలన కూర్చోబెడితే.. వారి మెదడు లో ఎదుగుదల లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వారు ఇతర విషయాలు అర్థం చేసుకునే సామర్ధ్యాన్ని కూడా అలవాటు చేసుకోరు.  వయసు పెరిగాక ఇది మానసిక అభివృద్ధికి ఆటంకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నప్పుడు వారికి ఫోన్ దూరంగా పెట్టడం ఎంతో అవసరం. వారిని ఎక్కువగా ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. అలాగే పజిల్స్ వంటివి ఆడేలా చూడాలి. టీవీ, ఫోన్లు ఒక గంట కంటే ఎక్కువ ఇవ్వకుండా జాగ్రత్తపడండి. పిల్లలు రోజులో కనీసం గంట సేపు శారీరక శ్రమ ఉండే ఆటలు ఆడేలా చూడండి. అది వారి ఎదుగుదలకు చాలా అవసరం. 



Also read: కాస్మోటిక్ ఉత్పత్తుల కోసం మన భారతీయ మహిళలు ఎంత ఖర్చుపెట్టారో తెలుసా?


Also read: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే రోజూ కొత్తిమీర తినండి



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.