అందంగా ఉంటే సమాజంలో విలువ పెరుగుతుందని అనుకుంటారు చాలా మంది. అందుకే మేకప్ పై శ్రద్ధ పెరిగిపోతోంది. మేకప్ కోసం అనేక రకాల కాస్మోటిక్స్ కొంటున్నారు. ఆ కాస్మోటిక్స్ బ్రాండెడ్‌వి అయితే చాలా ఎక్కువ ధర ఉంటాయి. అయినా కూడా భారతీయ మహిళలు వాటిని కొనేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఓ సర్వే ప్రకారం ఈ ఏడాది ఆరు నెలల్లోనే కాస్మోటిక్స్ కోసం ఏకంగా అయిదు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారట భారత వనితలు. కాస్మోటిక్స్ లో ఎక్కువగా లిప్ స్టిక్, నెయిల్ పాలిష్, ఐ లైనర్, ఫౌండేషన్, ఐ లాషెస్ వంటివి అధికంగా కొంటున్నారు. 


కాంతర్ వరల్డ్ ప్యానెల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో పైన చెప్పిన విషయాలు తెలిశాయి. ఇప్పుడు ఇంట్లో ఉండేందుకు మహిళలు ఇష్టపడడం లేదు. ఉద్యోగాలు చేసేందుకు, చిన్న చిన్న బిజినెస్‌లు చేసేందుకు వారు ఇష్టపడుతున్నారు. అందుకే కాస్మోటిక్ వాడకం కూడా వారిలో పెరిగింది. కార్పోరేట్ కంపెనీలలో చేరే మహిళల సంఖ్య పెరుగుతోంది. దీని వల్ల కాస్మోటిక్ అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. బిజినెస్ ఉమెన్‌గా మహిళలు రాణిస్తున్నారు. రిసెప్షనిస్టులు, ఎయిర్ హోస్టెస్ వంటి ఉద్యోగాలకు కచ్చితంగా మేకప్ అవసరం. అందుకే కాస్మోటిక్ కొనుగోళ్లు జోరు మీద ఉన్నాయి.  


సర్వేలో భాగంగా పది నగరాల్లోని మహిళలు కొన్న కాస్మోటిక్స్ జాబితాను పరిశీలించారు. ఆ పది నగరాల్లోని వారే పది కోట్లకు పైగా సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఇక మిగతా నగరాలు, పట్టణాలలో ఉన్న మహిళలు కొన్న వాటితో పోలిస్తే వాటి సంఖ్య ఇంకా అధికంగా ఉంటుంది. అయితే కాస్మోటిక్స్‌ను 40 శాతం మంది మహిళలు ఆన్ లైన్లోనే కొంటున్నట్టు సర్వే చెబుతోంది. వీరంతా ఆరు నెలల్లోనే అయిదు వేల కోట్ల రూపాయలు కాస్మోటిక్స్ కోసం ఖర్చు పెట్టినట్టు నివేదిక వివరిస్తోంది. 


ఒక్కో భారతీయ మహిళ ఆరు నెలలకు 1200 రూపాయలకు పైగా కాస్మోటిక్స్ కోసం ఖర్చు పెడుతున్నట్టు తేలింది. దీన్ని బట్టి మన మహిళలు అందంగా కోసం పడే ఆరాటం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్‌లో పని చేసే మహిళల సంఖ్య పెరుగుతుండడం వల్లే కాస్మోటిక్స్ వాడకం పెరుగుతుంది. కాస్మోటిక్ కంపెనీల ప్రకటనలు కూడా అధికంగా వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలోని ఇన్ఫ్లూయెన్సర్ల చేత యాడ్స్ ఇప్పించి మరీ కొనుగోళ్లు పెంచుకుంటున్నారు. 


మేకప్ ఉదయం వేసుకున్నాక ఎక్కువ సమయం ఉంచుకోవడం మంచిది కాదు. సాయంత్రం ఇంటికి చేరాక మేకప్ పూర్తిగా రిమూవ్ చేసుకోవాలి. లేకుంటే మొటిమలు వంటివి వచ్చే అవకాశం ఉంది. కొన్ని హానికరమైన కాస్మొటిక్స్ ఎక్కువగా వాడకూడదు. తడిగా ఉండే వైప్స్ తో ముఖాన్ని తుడిచేయాలి. చల్లటి నీటితో కడిగేసుకోవాలి. అప్పుడే చర్మ రంధ్రాలు శుభ్రంగా ఉంటాయి. 


Also read: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే రోజూ కొత్తిమీర తినండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.